- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth: ప్రధానికి ఊడిగం చేయడాన్ని ఈటల మానుకోవాలి
దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్ మీడియాతో మూసీ ఒడ్డున నివసించే పేద కుటుంబాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారంటూ కేటీఆర్, హరీశ్‌రావులపై ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ను ఆనాడు తీసుకొచ్చి ఇప్పుడు అడ్డం పడడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. నిజంగా పేదలపై వారిద్దరికీ ప్రేమ ఉంటే మూసీ మురికి కంపులో బతుకుతున్న వారికి మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి ఏం చేయాలో తగిన ప్రత్యామ్నాయాలను ప్రభుత్వానికి సూచించాలన్నారు. సోషల్ మీడియాను నమ్ముకుంటే అధికారంలోకి వస్తామని వారు కలలు గంటున్నారని, కానీ దానికి బదులుగా చర్లపల్లి జైలుకెళ్ళి చిప్పకూడు తినడం ఖాయమన్నారు. దివంగత మంత్రి కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమం సందర్భంగా పేదలకు ఆయన చేసిన కృషిని గుర్తుచేస్తూ మూసీ అంశాన్ని సీఎం రేవంత్ ప్రస్తావించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుతో రివర్ బెడ్, బఫర్ జోన్‌లో నివసిస్తున్న పేద కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆనాథలు కానివ్వదని, అన్ని విధాలా ఆదుకుని మంచి భవిష్యత్తు ఇస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ కుటుంబాలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం నొక్కిచెప్పారు. రెచ్చగొట్టే ప్రతిపక్ష నేతల మాటలు నమ్మొద్దని, ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నదని వివరించారు. పదేండ్లలో దోచుకున్న సొమ్ముతో ఫామ్ హౌజ్‌లు కట్టుకున్న బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు వాటిని కాపాడుకునేందుకు పేదల పక్షం ఉంటున్నామనే ముసుగును అడ్డుపెట్టుకుంటున్నారని, పేదలను రక్షణ కవచంలా వాడుకుంటున్నారని, వారి మాటల మాటలో పడొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. ఫామ్‌హౌజ్‌లలో జమీందార్లుగా బతికే వారు ఇప్పుడు మూసీ మురికి కంపులో నివసిస్తున్న పేదలను ఎప్పటికీ అలాగే ఉంచి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని పేద కుటుంబాలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారిని ఆదుకోడానికి పది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నదని స్పష్టత ఇచ్చారు. పేదల మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు.
పేదలను ఆదుకోవాలనే చిత్తశుద్ధే బీఆర్ఎస్ నేతలకు ఉంటే పార్టీ నిధిలోంచి రూ. 500 కోట్లను ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. వందలాది ఎకరాల్లో కట్టుకున్న ఫామ్ హౌజ్‌లలో కొంత భూమిని పేద కుటుంబాలకు నివాస వసతి కల్పించేందుకు దానం ఇవ్వాలని సూచించారు. ఆ ఆస్తులన్నీ తాతల నుంచి వచ్చినవేమీ కాదని, పదేండ్లు అధికారంలో ఉండి దోచుకున్నవేనని అన్నారు. పేద కుటుంబాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్... ఇప్పటికైనా ఆ కుటుంబాలను ఆదుకోడానికి ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ప్రత్యామ్నాయాలు సూచించాలని సీఎం అప్పీల్ చేశారు. ప్రభుత్వానికి ఎవరిపైనా ఎలాంటి కోపం లేదని, ప్రజలకు మేలు చేయాలన్న అంశాన్నే ఎజెండాగా పెట్టుకున్నదన్నారు. ఈ ముగ్గురూ సచివాలయానికి వస్తే తనతో పాటు మంత్రులు, అధికారులు కలిసి చర్చించుకుందామని, మూసీ కంపు నుంచి పేద కుటుంబాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రత్యామ్నాయాలపై ఆలోచిద్దామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని కమిటీని ఏర్పాటు చేసి అందులో ప్రతిపక్ష లీడర్లను కూడా సభ్యులుగా చేర్చాలని సీఎం సూచించారు.
పేదలను ఆదుకోడానికి ఎలాంటి సూచనలు ఇచ్చినా ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. సబర్మతి రివర్ ఫ్రంట్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తి చప్పట్లు కొట్టి ఊడిగం చేస్తున్న ఎంపీ ఈటల రాజేందర్ ఇప్పటికైనా ప్రభుత్వానికి సూచనలు చేయాలన్నారు. సబర్మతి తరహాలో మూసీని కూడా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తే ఈటల రాజేందర్‌కు వచ్చిన నష్టం, కష్టమేంటని సీఎం ప్రశ్నించారు. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రావాలంటూ కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు పిలుపునిచ్చారు. మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి... అంతేగానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు.. అని సీఎం వ్యాఖ్యానించారు. పేదలకు మంచి గృహవసతి కల్పించడానికి అవసరమైతే మలక్‌పేట్‌లోని రేస్ కోర్టును, అంబర్‌పేట్‌లోని పోలీస్ ఆకాడమీని హైదరాబాద్ సిటీ వెలుపలకు తరలించి అక్కడ పేదలకు ఇండ్లు కట్టిద్దామన్నారు.
రెండు మూడు రోజులుగా రైతు దీక్షల పేరుతో బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డ సీఎం రేవంత్... ప్రభుత్వం మీద బురద జల్లడానికే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని, రైతుల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. నిజంగా రుణమాఫీపై చర్చించాలనుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2018-23 మధ్యకాలంలో అమలు చేసిన రుణమాఫీ కేవలం రూ.11 వేల కోట్లేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 26 రోజుల వ్యవధిలో 22 లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల వరకున్న పంట రుణాలను రూ. 18 వేల కోట్లతో మాఫీ చేసిందని సీఎం వివరించారు. కొన్ని వివరాలు మిస్‌మ్యాచ్ కావడంతో, టెక్నికల్ సమస్యలతో కొద్దిమంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని, అలాంటి సమస్యలున్నవారు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి వివరాలు ఇవ్వవచ్చని, పరిష్కరించడానికి వారు సిద్దంగా ఉన్నారని గురత్తుచేశారు. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దని సూచించిన సీఎం రేవంత్... వారి సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటులో కాకా వెంకటస్వామి :
రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమంది నేతల్లో కాకా వెంకటస్వామి ఒకరని వివరించిన సీఎం రేవంత్.. తెలంగాణ ఏర్పాటులో ఆయన కంట్రిబ్యూషన్ ఉన్నదన్నారు. సోనియాగాంధీని ఒప్పింది తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడొద్దని చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు చాలా గొప్పలు చెప్పుకుంటున్న నేతలు ఆనాడు ఎన్నికల్లో గెలవడానికి కాకా సహకారాన్ని తీసుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారని ఆరోపించారు. ఇప్పుడు ఆ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలంటూ అధికారులను ఆదేశించానని గుర్తుచేశారు. పేదోళ్ళ గుండె ధైర్యం కాకా అని, నిరుపేదలకు అప్పట్లోనే ఇండ్లు ఇప్పించారని పేర్కొన్నారు. ఆనాడే సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచారన్నారు. జాతీయ స్థాయిలో నెహ్రూను చాచా అని పిలిస్తే రాష్ట్రంలో గడ్డం వెంకటస్వామిని కాకా అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటారని తెలిపారు. జాతీయ కాంగ్రెస్ కార్యాలయానికి తన ఇంటినే విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కాకా కుటుంబ సభ్యుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నదే పార్టీ ఆలోచన అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.