- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీసీల ముసుగులో సీఎం రేవంత్‌రెడ్డి ధర్నా : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ రిజర్వేషన్ల పేరు జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో ధర్నాకు దిగడం 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నంగానే బీజేపీ, తెలంగాణ సమాజం చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లు కల్పించడంలో రేవంత్ కు చిత్తశుద్ధి లేదని తాము ముందు నుంచి చెబునతున్న విషయం ఇప్పుడు నిరూపితమైందన్నారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్రంపై నెపం ఎలా నెడుతారని, రిజర్వేషన్ల పెంపు మీ పరిధిలో లేకపోతే, ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేక డ్రామాలాడుతున్నారని రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి అంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి వెనక ఉండి డ్రామాలు ఆడిస్తున్నాడని మండిపడ్డారు. ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే జీర్ణించుకోలేక మోడీని రాహుల్ గాంధీ అసభ్యంగా తూలనాడిన విషయాన్ని బీసీలు ఇంకా మరచిపోలేదన్నారు. కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మరచిపోయారని ఎద్దేవా చేశారు. బీసీల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో గత్యంతరం లేక 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేశారనే తప్పితే, బీసీల బాగు కోసం కాదన్నారు.
బీసీ గర్జన కాదు – కాంగ్రెస్ మాయగర్జన : ఎంపీ లక్ష్మణ్
బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, బీసీలను మరోసారి మోసం చేయడానికి కుట్రపన్నుతోందని ఎంపీ లక్ష్మణ్ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటన పూర్తి మోసపూరితమైనది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా పోరు గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ మరో రాజకీయ డ్రామాకు తెరలేపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నడూ న్యాయం చేయలేదని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న నినాదం కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెట్టేందుకు వేస్తున్న కొత్త పథకం అన్నారు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ కు తపన ఉంటే, వారి ప్రభుత్వంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఎందుకు కల్పించలేదని, మంత్రివర్గంలో బీసీలకు కేవలం ఇద్దరినే ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో బీసీలకు పూర్తి న్యాయం జరిగేలా బిజెపి నిరంతరం పోరాడుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌చేశారు. మోడీ పాలనలో బీసీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించింది. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీసీల హక్కుల కోసం పార్టీ బలమైన పోరాటం చేస్తుందన్నారు.
బీసీల అభివృద్దికి కాంగ్రెస్అడ్డు తగులుతుంది : బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్
బీసీల కోసం కాంగ్రెస్ జంతర్‌మంతర్‌లో ధర్నాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్మండిపడ్డారు. బీసీల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడి బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఘనత ఆపార్టీ సొంతమన్నారు. కాంగ్రెస్ బీసీల కోసం ధర్నా చేస్తున్నామంటే నమ్మేందుకు ప్రజలు, బీసీలెవరూ సిద్ధంగా లేరని, ఆసలు కాంగ్రెస్ ను ఎందుకు నమ్మాలని పేర్కొన్నారు.
నెహ్రూ కుటుంబీకులే కాదు, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను 46 శాతమే ఉన్నారనడం చెప్పడం బీసీలను వంచించడమేనన్నారు. ముస్లిం బీసీలంటూ అన్యమతస్తులకు బీసీ రిజర్వేషన్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి బీసీలకు బద్ధ విరోధి, బీసీ వ్యతిరేకి. బీసీలకు తీరని అన్యాయం చేస్తున్న ఆయనను బీసీలు ఎప్పడు క్షమించరన్నారు. సాకులు చెప్పకుండా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని లేకుంటే కాంగ్రెస్ కు బీసీలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.