పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా?.. బీజేపీ నేతల తీరుపై CM రేవంత్ సెటైర్

by GSrikanth |
పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలా?.. బీజేపీ నేతల తీరుపై CM రేవంత్ సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీతోనే సామాజికన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని తెలిపారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందని అన్నారు. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్‌ను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందని చెప్పారు. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదామని తెలిపారు. పదేళ్లు మోడీ ప్రధానిగా ఉన్నా.. తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు.

బుల్లెట్ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన మోడీ.. వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోడీ.. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోందని ప్రశ్నించారు. ఏం చూసి మూడోసారి మోడీకి ఓటు వేయాలని బీజేపీ అడుగుతున్నారు? అని మండిపడ్డారు. బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుందని సెటైర్ వేశారు. ఇదే చక్కటి అవకాశం కేంద్రంలో కాంగ్రెస్‌ను గెలిపించుకుందాం.. రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారు.. మనం ఆయన కోసం 14 సీట్లు ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed