- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth: రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా SC వర్గీకరణ

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు మంచి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని అన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ భేటీ అయ్యారు. షెడ్యూల్డు కులాల వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫారసులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్‌కమిటీ, న్యాయ కమిషన్ వేసి నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
నివేదికలను వేగంగా రూపొందించి.. వాటిపై కేబినెట్‌లో చర్చించాకే అసెంబ్లీలో ప్రవేశపెట్టామని తెలిపారు. ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతోపాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని మంద కృష్ణకు సూచించారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఏ, బీ, సీ, డీలుగానే వర్గీకరించండి
ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమిట్మెంట్‌ను మందకృష్ణ మాదిగ అభినందించారు. వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, సీఎంకు ఒక సోదరుడిగా అండగా ఉంటానన్నారు. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. మొదటి నుంచి తమ పోరాటం ఏ,బీ,సీ,డీ వర్గీకరణ డిమాండ్‌తోనే కొనసాగుతున్నదని.. ఉమ్మడి రాష్ట్రంలోనూ అలాగే అమలు చేశారని గుర్తుచేశారు.
జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో రిజర్వేషన్ల శాతం, గ్రూప్ 1,2,3లో ఉన్న కులాల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వాటిని పరిష్కరించాలని కోరారు. అలాగే.. ఎస్సీలలో జనాభా పరంగా మూడో అతిపెద్ద కులంగా ఉన్న నేతకాని వర్గాన్ని, హోలియ దాసరి, మహార్ మరికొన్ని దళిత కులాలను కలిపి ప్రత్యేక గ్రూపుగా ఏర్పాటు చేయాలని సూచించారు. తమ అభ్యంతరాలను సీఎంకు లిఖిత పూర్వకంగా ఇచ్చినట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న క్రమంలోనే ఎస్సీల రిజర్వేషన్లను 15 శాతం నుంచి 18 శాతానికి పెంచుతామని చేవెళ్ల డిక్లరేషన్‌ను కూడా అమలు చేయాలని కోరారు.