ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు KCR భారీ స్కెచ్.. ఎన్నికల వేళ గులాబీ బాస్ వ్యూహం ఫలిస్తుందా..?

by Satheesh |   ( Updated:2023-06-04 07:17:35.0  )
ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు KCR భారీ స్కెచ్.. ఎన్నికల వేళ గులాబీ బాస్ వ్యూహం ఫలిస్తుందా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్ర అవతరణ దినోత్సవేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వం ఇరువై ఒక్కరోజూ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుంది. అయితే ఈ ఉత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారా? లేకుంటే ప్రజాప్రతినిధులు సొంతఖర్చులతో వారిని తీసుకొస్తారా? అనేది పార్టీలో చర్చనీయాంశమైంది. దశాబ్ది ఉత్సవాలతో రాష్ట్ర అభివృద్ధిని వివరిస్తే ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి తగ్గుతుందని నేతలు భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వస్తుందనే ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఏమేరకు మైలేజ్ వస్తుందనే బేరీజు వేసుకుంటున్నారు.

ప్రభుత్వంపై రోజురోజూకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. స్థానిక నాయకత్వంపై అయినా సానుకూల దృక్పథంతో ఉన్నారా అంటే వారిపై కూడా అన్ని వర్గాలు గుర్రూగానే ఉన్నారు. కొద్దిమందిపై మాత్రమే సదాభిప్రాయం ఉన్నదని ప్రభుత్వ సర్వేల్లోనే స్పష్టం కావడంతో వ్యతిరేకతను తగ్గించేందుకు బీఆర్ఎస్ అధినేత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ ఇచ్చారు. గత 9ఏళ్లలో నిర్వహించని విధంగా ఈసారి రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుంది.

21రోజులపాటు ప్రజల్లోనే ప్రజాప్రతినిధులు ఉండేలా ప్రణాళిక ఇచ్చింది. అంతేకాదు రైతు దినోత్సవం రోజూ రైతులను, సురక్షా దినోత్సవం రోజూ పోలీసులు, విద్యుత్తు విజయోత్సవం నాడు అధికారులు, పారిశ్రామిక ప్రగతి ఉత్సవం రోజూ పారిశ్రామిక వేత్తలను, సాగునీటి దినోత్సవంన ప్రజలను, రైతులను, చెరువుల పండుగ నాడు మత్స్యకారులు, రైతులతో సహఫంక్తి భోజనాలు ఇలా నిర్వహించి ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించనున్నారు. అంతేగాకుండా అభివృద్ధిని తెలిపేలా ఫ్లెక్సీలు, ప్రచారసాధనాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.

ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

అభివృద్ధి పనులు నిధుల కొరతతో పెండింగ్‌లో ఉండటం, దళితబంధు అందరికీ రాకపోవడం, పోడుభూములకు పట్టాలివ్వడంలో జాప్యం, డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేపట్టకపోవడం, చేసినవాటిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు, ఇంటిజాగ ఉన్నవారికి 3లక్షల హామీ అమలుకునోచకపోవడం, నిరుద్యోగభృతి రాకపోవడం, తదితర కారణాలతో ప్రజలు ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్నారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ప్రతి గ్రామంలో ఉత్సవంలా నిర్వహిస్తుండటంతో వ్యతిరేకత తగ్గుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల్లో ఎలా కలిసొస్తుందనే గుసగుసలు

ఏళ్ల తరబడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఇప్పుడు కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మళ్లీ అవే హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. పోడుభూముల పంపిణీకి ఈ నెల 24వ తేదీని ప్రకటించగా, గృహలక్ష్మీకి వచ్చే నెల అని ఇలా మరోసారి ప్రకటించడం కలిసి వస్తుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే జరిగిన నష్టం పార్టీకి జరుగడంతో ఎలా కలిసొస్తుందనే చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే అసలు దశాబ్ది ఉత్సవాలతో ప్రజల్లో ఏ మేర కలిసి వస్తుంది? ఎంత మైలేజ్ వస్తుందని ఎమ్మెల్యేలు బేరీజు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత తగ్గి గెలిచే అవకాశం ఉంటుందా? నేతలు సైతం ఏమేరకు ఉత్సవాలను సక్సెస్ చేస్తున్నారనేదానిపైనా పార్టీ సైతం ఆరా తీయనుంది. ఏదీ ఏమైనప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం దశాబ్ది ఉత్సవాలు కలిసి వస్తాయనే ఆశలు పెట్టుకున్నారు.

Read More: సిటీని వదలని హెల్త్‌స్టాఫ్.. జూనియర్లపై వేధింపులు, వర్క్​ప్రెజర్

వీక్లీ ఆఫ్ లేదు.. టైంకు జీతం రాదు.. ఇదీ తెలంగాణలో పోలీసుల పరిస్థితి!

ధాన్యం కొంటలేరని 167వ జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

Advertisement

Next Story

Most Viewed