లెఫ్ట్ పార్టీలతో BRS పొత్తు దాదాపు ఖరారు.. తమ్మినేని, కూనంనేనికి KCR హామీ!

by GSrikanth |   ( Updated:2023-04-24 09:58:11.0  )
లెఫ్ట్ పార్టీలతో BRS పొత్తు దాదాపు ఖరారు.. తమ్మినేని, కూనంనేనికి KCR హామీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లెఫ్ట్ పార్టీలతో బీఆర్ఎస్ పొత్తుపై కొంత క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తున్నది. సర్వే రిపోర్టులు చూపి ఆయా స్థానాల్లో గెలుపు కష్టమని వివరిస్తూ సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులకు కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. పోటీ చేసే ఆలోచనను విరమించుకోవాలని సూచించినట్టు సమాచారం. వామపక్షాలు సైతం ఇచ్చినన్ని సీట్లు తీసుకుని, బీఆర్ఎస్ తో పొత్తుతోనే ఎన్నికల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

సర్వే చూపి సర్ది చెప్పి..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సీపీఐ, సీపీఎంలు ఎక్కడెక్కడ పోటీ చేయాలో దాదాపుగా నిర్ణయానికి వచ్చాయి. ఖమ్మం జిల్లా నుంచి రెండు పార్టీలు ఐదు సీట్లను ఆశిస్తున్నాయి. వీటిలో ఖమ్మం జిల్లా భద్రాచలం, వైరా, కొత్తగూడెం స్థానాలను సీపీఐ, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలను సీపీఎం కోరుతున్నది. అయితే బీఆర్ఎస్ మాత్రం రెండు లెఫ్ట్ పార్టీల కార్యదర్శులకు మాత్రం ఎమ్మెల్సీపై హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఏయే స్థానాల్లో ఈ రెండు పార్టీలకు ఎంత బలం ఉన్నది, విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయనేదానిపై ఇప్పటికే బీఆర్ఎస్ వేర్వేరుగా రెండు సర్వే రిపోర్టులను తెప్పించుకున్నది. పోటీ చేస్తే గెలవడం కష్టమేనని ఆ సర్వే రిపోర్టుల ద్వారా వెల్లడైన వివరాలను కేసీఆర్ వారికే పంపించి అర్థం చేయించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనలపై ఒకరు సంతృప్తి వ్యక్తం చేసినా మరొకరు మాత్రం ఆలోచించిన తర్వాత రిప్లై ఇస్తానంటూ కేసీఆర్‌కు మధ్యవర్తి ద్వారా ఇన్ఫర్మేషన్‌ను పంపినట్లు తెలిసింది. రాష్ట్ర కార్యదర్శులుగా వీరిద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్రమంతా ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సమయాన్ని ఎలా వెచ్చిస్తారన్న అంశాన్ని గతంలోనే గులాబీ బాస్ వారి దగ్గర ప్రస్తావించారు. ఈ రెండు పార్టీలకు ఎక్కడెక్కడ అవకాశం కల్పంచాలన్నదానిపై ఎన్నికల షెడ్యూలు సమయానికి క్లారిటీకి రావచ్చని సూచించి ప్రస్తుతానికి ఎమ్మెల్సీ అంశంపై స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.

అడిగే స్థానాల్లో తీవ్ర పోటీ..

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం లేదా పాలేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఆ స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్‌లతో పాటు గతంలో పోటీచేసి ఓడిపోయిన వారు క్యూలో ఉన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్, పాలేరులో కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన కందాళ ఉపేందర్ రెడ్డి, ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈసారి రేసులో ఉన్నారు. వీరిని కాదని తమ్మినేనికి టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువేనని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నుంచి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నుంచి ఆ పార్టీ మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారు. వీరిద్దరి విషయంలో సైతం గెలుపు అవకాశాలను గులాబీ బాస్ వారికి లెక్కలతో సహా సర్వే రిపోర్టును పంపినట్లు తెలిసింది. కూనంనేనికి కూడా ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తానని బీఆర్ఎస్ నుంచి సిగ్నల్ వెళ్లడంతో ఎలాంటి రిప్లై ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ స్థానంలో సిట్టింగ్ వనమా వెంకటశ్వరరావు, ఆ పార్టీకి చెందిన జలగం వెంకటరావు, కొత్తగా ఆశిస్తున్న రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వారివారి ప్రయత్నాల్లో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో వైరా, భద్రాచలం స్థానాలను కూడా సీపీఐ కోరుతున్నది. వైరా స్థానంలో గతంలో సీపీఐ తరఫున విజయాబాయి పోటీ చేసి ఓడిపోయారు. భద్రాచలం స్థానం కాంగ్రెస్ చేతిలో ఉన్నది.

ఇచ్చినన్ని తీసుకుందాం..

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్‌తో పొత్తులోకి వెళ్లిన సీపీఐ, సీపీఎం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ బంధాన్నే కొనసాగించాలని భావిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక పోరు పేరుతో కాంగ్రెస్‌వైపు వెళ్లడం కంటే బీఆర్ఎస్‌తో కొనసాగడమే బెటర్ అని అనుకుంటున్నాయి. రెండు పార్టీలకు చెరి ఒక అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చినా సర్దుకునే అవకాశాలే ఉన్నాయి. చివరి వరకూ మరిన్ని స్థానాల కోసం పట్టుబట్టినా కేసీఆర్‌తో ముఖాముఖి జరిగే చర్చల్లో అనివార్యంగా అంగీకారం తెలిపే చాన్సులే ఎక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం. పొత్తును కాదని ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేసినా రెండు పార్టీల కార్యదర్శులకు గెలుపుపై నమ్మకం లేదు. పోడు భూముల విషయంలో ఆదివాసీల నుంచి వస్తున్న మద్దతు చూసిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చినట్లు ఆ పార్టీల నేతలు వివరించారు. రెండు ఎమ్మెల్సీ అవకాశాలపై కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు ఓకే చెప్పి ఇచ్చినన్ని అసెంబ్లీ సీట్లను మాత్రమే తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది.

Also Read..

ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో తన బలాన్ని పరీక్షించుకోబోతున్న బీఆర్ఎస్.. సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?

Advertisement

Next Story