T-టీడీపీపై చంద్రబాబు ఫోకస్! స్టేట్ చీఫ్ బాధ్యతలు వారికే?

by Rajesh |
T-టీడీపీపై చంద్రబాబు ఫోకస్! స్టేట్ చీఫ్ బాధ్యతలు వారికే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలో ఘన విజయం సాధించిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతున్నది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసి పార్టీని బలోపేతం చే‌యాలని భావిస్తున్నట్లు టాక్. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. 2014లో అధికారంలోకి వచ్చి అక్కడికే పరిమితమయ్యారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నా పట్టించుకోలేదనే చర్చ ఉన్నది. తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీ వీడుతున్నా రెస్పాండ్ కాలేదనే ప్రచారం ఉన్నది.

2019లో ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో తెలంగాణలో పార్టీ గురించి మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. అయితే 2024లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణ నేతలతో రివ్యూ నిర్వహించనున్నట్లు తెలిసింది. కాగా, ఐదురోజుల క్రితం చంద్రబాబు టీటీడీపీ నేతలతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రత్యేక భేటీ నిర్వహించారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఏయే నియోజకవర్గాల్లో బలంగా ఉన్నామనే వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. పార్టీ నిర్మాణంపై దృష్టిసారిస్తానని వారితో చెప్పినట్లు సమాచారం.

యూత్‌కు స్టేట్ పార్టీ చీఫ్ బాధ్యతలు

తెలుగుదేశం పార్టీ 2014లో పదికిపైగా అసెంబ్లీ స్థానాలు, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో విజయం సాధించింది. 2018లోనూ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయబావుటా ఎగరవేసింది. అయినా అధినేత చంద్రబాబు సరైన ఫోకస్ లేకపోవడం, రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన ఎల్. రమణ, బక్కని నర్సింహులు ఆశించిన స్థాయిలో పని చేయకపోవడంతో పార్టీ బలహీనమవుతూ వచ్చింది. 2022లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు టీడీపీ పగ్గాలు అప్పజెప్పడంతో పార్టీలో కాస్త జోష్ వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ రాకపోవడంతో గతేడాది అక్టోబర్ 10న ఆయన కూడా రాజీనామా చేశారు.

దీంతో మళ్లీ టీడీపీ కార్యక్రమాలు స్తంభించి పోయాయి. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యారు. ఎనిమిది నెలలుగా టీటీడీపీ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. అయితే ఈ సారి యువతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానని చంద్రబాబు నాయుడు నాయకులకు హింట్ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, నన్నూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, గడ్డిపద్మావతి సైతం అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. చంద్రబాబు వీరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా..

తెలంగాణలో బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. ఒక్క ఎంపీని గెలిపించుకోలేకపోయింది. దీంతో టీడీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పార్టీ కేడర్ బలంగా ఉంది. దీంతో పార్టీకి పూర్వవైభవం తేవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

స్థానిక ఎన్నికల్లో పోటీకి సమాయత్తం

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడంతో పార్టీ నేతలు, కేడర్‌లో నైరాశ్యం ఉంది. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అందుకోసం త్వరలోనే తెలంగాణ నేతలతో భేటీ అయ్యి రివ్యూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్ని పంచాయతీల్లో పోటీ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అధినేతకు పూర్తి వివరాలను అందజేసేందుకు పార్టీ నేతలు నియోజకవర్గాలవారీగా వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story