Central Govt.: రోడ్డు యాక్సిడెంట్ల బాధ్యత ఆ ఐదు శాఖలదే..! కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు

by Shiva |
Central Govt.: రోడ్డు యాక్సిడెంట్ల బాధ్యత ఆ ఐదు శాఖలదే..! కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే.. భారతదేశంలో యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి అత్యధికంగా చనిపోతోంది. రోడ్డు ప్రమాదాలు ప్రాణాంతక రోగాలైన క్యాన్సర్, ఎయిడ్స్ కంటే దారుణంగా మన దేశ యువతను బలితీసుకుంటున్నాయి.’ ఈ మాటలు అన్నది స్వయంగా మన దేశ రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. అందుకే, దేశం లోని అన్ని రాష్ట్రాల రోడ్లను పెద్ద ఎత్తున మెరుగుపరచాలని చెబుతున్నారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలతో కలిసి చర్యలకు నడుం బిగించినట్టు తెలిసింది.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు మిగతా శాఖల సమన్వయంతో మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రాల పరిధిలో జరిగే ప్రమాదాలకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొత్త నిబంధనలు అమ లు చేయాలని యోచిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్‌అండ్‌బీ, పోలీసు, హెల్త్‌, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్టు శాఖలకు చెందిన ఉన్నతాధికారులే బాధ్యత వహించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రాల పరిధిలోని ప్రధాన రోడ్లు, జాతీయ రహదారులకు లింకుగా ఉండే రోడ్ల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్‌ఏఐ తరహాలో చేపట్టే చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఉన్నతాధికారులు కసరత్తులు ప్రారంభించారు. త్వరలో వీటిపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపనున్నట్టు తెలిపారు.

ఐదేండ్లకు సరిపడా బడ్జెట్

ఐదేళ్ల పాటు చేపట్టే రోడ్డు భద్రతా చర్యలకు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల రహదారులకు సుమారు రూ.7,700 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధుల్లో 50 శాతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ భరిస్తుంది. 25 శాతం ప్రపంచ బ్యాంకు, మరొక 25 శాతం ఏషి యన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఏడీబీ)ల నుంచి రుణంగా పొందనున్నట్లుగా తెలిసింది. ఈ నిధులను దేశంలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే 12 రాష్ట్రాలకు మాత్రమే ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, అందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా ఏటా రూ.60 కోట్లు రాష్ట్ర రోడ్లపై జరిగే ప్రమాదాల నివారణకు ఖర్చు చేయనుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో రూ.360 కోట్లు భరించనుంది. రోడ్లు, భవనాలు, పోలీసు, వైద్య శాఖ, ట్రాన్స్‌పోర్టు, విద్యా శాఖలు తమ పరిధిలోని అంశాలపై చర్యలు చేపట్టి నోడల్‌ ఏజెన్సీగా ఉండే రహదారుల భద్రత అధికారికి నివేదించనున్నారు. ఈ ప్రకియ్ర పూర్తయిన వెంటనే కేంద్రం, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పం దం అధికారికంగా జరగనుందని కేంద్ర రవాణా శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.

రాష్ట్ర రోడ్ల భద్రతకు ఏం చేస్తారు?

నేషనల్‌ హైవేలపై ఒకే ప్రదేశంలో ప్రమాదాలు తరచూ జరిగినప్పుడు సాధారణంగా ఆ ప్రాంతాన్ని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా బ్లాక్‌ స్పాట్‌గా గుర్తిస్తుంది. దానివద్ద ఇంజినీరింగ్‌ డిజైనింగ్‌ వర్కులను పరిశీలించి, సంబంధిత విభాగ అధికారులు నివేదించిన మేరకు చర్యలు చేపడుతారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఐదు శాఖల్లో ఒక్కో శాఖ నుంచి ఒక కీలక అధికారి దీనికి బాధ్యులుగా ఉంటారు. ఏ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయో గుర్తించి చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర రోడ్లపై జరిగే ప్రమాదాలను బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించేందుకు పోలీసు శాఖ ఇచ్చే సమాచారాన్ని కీలకంగా తీసుకుంటారు. ప్రమాదాలు జరుగుతున్న తీరు, మృతులు, క్షతగాత్రులు గాయపడిన తీరు వైద్య శాఖ రిపోర్టుల మేరకు సమాలోచనలు చేస్తారు. ఇక చివరగా, విద్యా శాఖ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చడం.. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి ఈ మేరకు చర్యలు తీసుకుంటారు.

ఆర్అండ్‌బీ ముందుకు..

ఈ బృహత్తర కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మిగతా శాఖలతో సమన్వయం చేయనున్నట్లు తెలిసింది. ప్రమాదాలు జరగక ముందు.. జరిగిన తర్వాత.. డిజైన్లలో మార్పులు చేర్పులు చేపట్టేది కేవలం రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులే. అందుకే, ఈ శాఖ మిగతా హోల్ ఆఫ్ డిపార్టమెంట్లతో ముందుకు వెళుతుందని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఈ విషయంపై తెలంగాణ సర్కారు కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని అధికారులు సైతం చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed