జనం సొమ్ముతో వ్యాపారం!

by Praveen Kumar Siramdas |   ( Updated:2024-07-30 11:22:22.0  )
జనం సొమ్ముతో వ్యాపారం!
X

జనం సొమ్ముతో వ్యాపారం!

– రూ.4 వడ్డీ ఆశ చూపి..

– కొత్త ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్

– హోం అప్లయిన్సెస్ బిజినెస్

– ఇప్పటికే 500 మంది కస్టమర్లు

– కేపీహెచ్ బీ కాలనీలోనే షోరూం

– వెల్ విజన్ ట్రేడర్స్ సరికొత్త దందా

దిశ, తెలంగాణ బ్యూరో:

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండొచ్చు. టెక్నాలజీ మీద కాస్త అవగాహన ఉంటే చాలు. ఎవరికీ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పకపోతే సేఫ్. కానీ మాటలతో గారడి చేసి ఆకాశంలో అద్భుతాలు చూపించే వారి నుంచి తప్పించుకోవడం కష్టం. రియల్ ఎస్టేట్, వ్యాపార, వాణిజ్య రంగాలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని ప్రచారం. ఈ క్రమంలో పెట్టుబడుల పేరిట విభిన్న కోణంలో మార్కెటింగ్స్ సాగుతున్నాయి. రూ.లక్ష పెట్టండి. 25 నెలల్లో డబుల్ అవుతుందంటున్నారు. రూ.లక్ష నుంచి ఎంతైనా మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ప్రతి నెలా వడ్డీతో కలిపి డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాం. కొన్ని కంపెనీలు తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని ప్రచారం చేస్తున్నాయి. ఎవరికి నిజాయితీగా, అనుకున్న పద్ధతి ప్రకారం డబ్బులు అందాయో తెలియదు. కానీ పీడీసీల ఆశ చూపి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. నెలకు రూ.100కు రూ.4 వడ్డీ చెల్లించే స్థాయి వ్యాపారాలు చేస్తున్నారా? అదెలా సాధ్యం? అలాంటప్పుడు వారే బ్యాంకుల నుంచి రూపాయికి మించని వడ్డీతో రుణాలు తీసుకొని వ్యాపారం చేయొచ్చు కదా! అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇంకొందరేమో మేం ఎలక్ట్రానిక్, హోం అప్లయిన్సెస్ షోరూం పెట్టాం అంటున్నారు. ఇప్పటికే మా దగ్గర 500 మందికి పైగా ఇన్వెస్ట్ చేశారు. వారందరికీ మేం ప్రతి నెలా డబ్బులు ఇస్తున్నామంటూ పోస్ట్ డేటెడ్ చెక్కుల వివరాలను చూపిస్తున్నారు. హైదరాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టులను చూపించి పెట్టుబడుల రూపేణా కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇలా ఒకటీ రెండు కాదు.. పదుల సంఖ్యలో కంపెనీలు కొత్త తరహా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టులను మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట దందాలు చేసి రూ.వేల కోట్లు ముంచేసి బోర్డులు తిప్పేశాయి. వేలాది మంది బాధితులు కేసులు పెట్టి పెట్టిన పెట్టుబడి వరకైనా వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ బై బ్యాక్, అధిక వడ్డీ ఆశ చూపి లాగేస్తున్న రూ.వందల కోట్లకు సంబంధించిన బాధితులు కూడా క్యూ కట్టే అవకాశం కనిపిస్తున్నది.

ఇన్వెస్టమెంట్ కాన్సెప్ట్

పైసా సొంతంగా పెట్టకుండా జనం సొమ్ముతోనే వందల ఎకరాలు కొనుగోలు చేసి బిజినెస్ చేస్తున్నారు. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ అనుభవంతో అవే కంపెనీలు కస్టమర్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఆపార్చునిటీ కాన్సెప్ట్ అంటూ కొత్త వ్యాపారానికి తెర తీశారు. తమ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే ముందే కొంత ల్యాండ్ ని మీ పేరిటే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఏడాది, రెండేండ్లల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ల్యాండ్ ని ప్లాట్ రూపంలో అందజేస్తామంటూ ఊరిస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో రూ.50 లక్షలకు ఎకరం ఉంటే రూ.కోటికి పైగా లెక్కించి కస్టమర్లకు అంటగడుతున్నారు. ఇలాంటి బిజినెస్ చేస్తోన్న రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అత్యధికం ఫైనాన్స్ సంస్థలే కావడం విశేషం. సుదీర్ఘ అనుభవం కలిగిన అనేక కంపెనీలు ఈ దందాను జోరుగా నడిపిస్తున్నాయి. ఐతే ఆ ల్యాండ్ ని రైతుల నుంచి కొనుగోలు చేయకుండానే మార్కెటింగ్ చేస్తుండడం గమనార్హం. ఇవి రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. ఎలాగూ ఫైనాన్స్ కంపెనీల్లో ఉండే కస్టమర్లకే వల విసురుతున్నారు. వారి పరిచయాన్ని వీటికి వాడుకుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే వారి పేరిట రిజిస్టర్డ్ చేసుకున్న భూములకు పెట్టుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి ఉండదు. పైగా ఆ భూమి సరిహద్దులు కూడా కస్టమర్లకు తెలియవు. ఎవరికో ఒకరికి అమ్మేసుకుందామన్నా కుదిరే పరిస్థితులు కనిపించడం లేదు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు.




రూ.4 వడ్డీ పక్కా

రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. ప్రతి నెలా రూ.9 వేల వంతున 20 నెలలు ఇచ్చేస్తాం. అంటే రూ.లక్షకు 20 నెలల్లో రూ.1.80 లక్షలు వస్తాయన్న మాట. రూ.లక్ష బయట వడ్డీ ఇస్తే నెలకు రూ.2లకు మించి రాదు. అంటే రూ.2 వేలు. 20 నెలల్లో రూ.40 వేలకు మించదు. వీళ్లేమో ఏకంగా రూ.4 వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. పైగా రూ.100 విలువైన బాండ్ పేపరు మీద పరస్పర అంగీకారపత్రం కూడా రాసిస్తారు. రూ.2 లక్షల విలువైన పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ముందే ఇచ్చేస్తారు. ఈ పెట్టుబడితో ఎల్ జీ, సామ్ సంగ్ కంపెనీ ప్రొడక్ట్స్, హోం అప్లయెన్సెస్ వ్యాపారం చేస్తారట. అది సొంతంగానే చేస్తారట. రూ.లక్ష నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా ఇప్పటికే రూ.500 మందికి పైగా పెట్టుబడి పెట్టినట్లు ఏజెంట్ ‘దిశ’కు వివరించారు. ఎక్కడో కాదు. హైదరాబాద్ లోనే. కేపీహెచ్ కాలనీ మెయిన్ రోడ్డులోనే. వెల్ విజన్ ట్రేడర్స్ పేరిట పెద్ద వ్యాపారమే చేస్తున్నారు. వీళ్లే బ్యాంకు నుంచి లోన్ తీసుకొని వ్యాపారభివృద్ధి చేసుకోవచ్చు. ఇలా కస్టమర్లకు ఏకంగా వందకు రూ.4 వడ్డీ వంతున ఎందుకు కట్టడం? బ్యాంకు వడ్డీ ఒక్క రూపాయి మించదు కదా. బయట ఇస్తే రూ.2 కు మించి వడ్డీ రాదు. దాంతో ఇలాంటి పెద్ద కంపెనీ, బడా షోరూమ్ అంటూ పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపకుండా ఉంటారా? ఐతే ఈ వడ్డీ కట్టుడు మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఇంతేసి లాభం వస్తుంటే సొంతంగానే పెట్టుబడులు సంపాదించుకోవచ్చు. ఇదే వ్యాపార సూత్రాన్ని ప్రాజెక్టు రూపంలో బ్యాంకర్లకు సమర్పిస్తే ఎన్ని రూ.వందల కోట్లయినా లోన్లు ఇచ్చేస్తాయి కదా!

వీకెండ్ స్పెషల్

శని, ఆదివారాల్లో పెట్టుబడి పెడితే స్పెషల్ ఆఫర్లు ప్రకటించారు. రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక గ్రాము గోల్డ్, రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 3 గ్రాముల గోల్డ్, రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 4 గ్రాముల గోల్డ్ ఇస్తామంటున్నారు. ఐతే ఇంత వడ్డీ ఎలా చెల్లించగలుగుతారని ప్రశ్నిస్తే తాము సొంత వ్యాపారం చేస్తున్నామంటున్నారు. ఎల్ జీ, సామ్ సాంగ్ ఉత్పత్తులనే ప్రధానంగా చెప్తున్నారు. బిజినెస్ లో లాస్ వస్తే ఎట్లా అని అడిగితే చెల్లింపులు మాత్రం సేల్స్ తో సంబంధం లేదని, తాము కమిట్మెంట్ ప్రకారమే ఇస్తామంటున్నారు. హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే అడిగేందుకు అవకాశం ఉంది. కానీ ఎంవోయూలతో ప్రతి నెలా రిటర్న్స్ ఇస్తామంటూ వ్యాపారం చేసే కంపెనీలు మోసం చేస్తే ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్ధితి నెలకొన్నది. బడా సంస్థలు వాళ్లు వ్యాపారం చేసేందుకు అవసరమైన పెట్టుబడి కోసం బ్యాంకులను సంప్రదించకుండా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేయడంలో ఆంతర్యమేమిటో మున్ముందు అర్ధం కానున్నది.

Advertisement

Next Story

Most Viewed