కవిత కోసం మోడీ దగ్గర మోకరిల్లిన కేసీఆర్..!

by sudharani |   ( Updated:2023-09-17 11:04:08.0  )
RS Praveen Kumar Visits US
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను కాపాడడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ దగ్గర మోకరిల్లుతున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇవాళ ఖమ్మం జిల్లా కూసుమంచిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అక్రమంగా దోచిన సొమ్ముతో ఢిల్లీ మద్యం వ్యాపారంలో పెట్టుబడులుగా మార్చారని ఆరోపించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే మంత్రి పువ్వాడ అజయ్ జిల్లాలో అక్రమ మైనింగ్, గ్రానైట్, ఇసుక, మట్టి తవ్వకాలు జరుపుతూ వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి పువ్వాడ దోపిడీ, అక్రమాలను ప్రశ్నించే వారిని కేసులు పెడుతూ, జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభ సభకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ద్వజమెత్తారు. పోడు భూములకు పట్టాలివ్వమని అడిగితే ఆదివాసీ రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ దేనని విమర్శించారు. 75 ఏళ్లుగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కాంగ్రెస్ ఏం సాధించిందని సభ నిర్వహిస్తుందో ప్రజలకు తెలపాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదరికాన్ని నిర్మూలించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. సెప్టెంబర్ 17 ను తమ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్విముక్తి దినంగా జరుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరలేదన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దెదింపితేనే పేదలకు నిజమైన విముక్తి లభిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed