80 సీట్లతో బీఆర్ఎస్ విజయం ఖాయం: మంత్రి హరీష్ రావు

by Satheesh |   ( Updated:2023-11-27 15:28:40.0  )
80 సీట్లతో బీఆర్ఎస్ విజయం ఖాయం: మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నాడు అధికారంలో ఉండి రైతులను గోస పెట్టింది.. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నది.. వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్.. రైతు బంధు వేయవద్దని ఫిర్యాదు చేశారు. అనుమతి ఇస్తే ఎలా ఇస్తారు అన్నారు. మళ్లీ రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. రైతుల నోటి కాడి బుక్కను లాగేసింది కాంగ్రెస్ పార్టీ అని, దొంగే దొంగ అన్నట్టు ఉంది కాంగ్రెస్ పరిస్థితి’ అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అక్టోబర్ 23న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి మానిక్ రావు థాక్రే రైతు బంధు వేయోద్దని ఈసీకి ఫిర్యాదు చేసింది నిజమా? కాదా?.. రేవంత్, ఉత్తమ్‌లు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆపాలని చెప్పింది వాస్తవమా? కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతుకు రైతుబంధు రావొద్దనే కాంగ్రెస్ కుట్ర అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఆ పార్టీ తెరదీసిందని మండిపడ్డారు. భట్టి రైతు బంధు దుబారా ఆంటే, రేవంత్ రైతులు బిచ్చగాల్లు అన్నాడని ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు ఒక్కరూపాయి ఇచ్చే నాయకుడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. దేశంలో రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ అని, కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ చేతిని అడ్డం పెట్టి రైతు బంధు ఆపలేరని, ఆపార్టీ రైతులపై ప్రేమ ఉన్నట్లు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. 11 విడుతల్లో రైతుబంధు ఇచ్చామని, అది ఆన్ గోయింగ్ పథకం అన్నారు.

రేవంత్‌కు వ్యవసాయం అంటే అవగాహన లేదు.. రైతులంటే ప్రేమ లేదన్నారు. నవంబర్ 30న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని, రైతులంతా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటుతో కాంగ్రెస్‌కు బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 3న మూడోసారి విజయం సాధించి.. డిసెంబర్ 6న రైతుబంధు ఇస్తామన్నారు. 80 సీట్లతో విజయం సాధించి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఎన్నికలో గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అని కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్లు రాస్తున్నారని, ఆ బాండు పేపర్లు చిత్తు కాగితాలతో సమానమన్నారు.

రాహుల్ గాంధీ వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కర్నాటకలో ప్రకటన చేసి 6 నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ముఖం చాటేశారన్నారు. రాహుల్ గాంధీ దమ్ముంటే ఉద్యోగాల విషయమై చిక్కడపల్లిలో కాదు బెంగళూరులో పెట్టాలని సవాల్ చేశారు. కర్నాటక ప్రజలను మోసం చేసింది చాలక 6 గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, కాంగ్రెస్ మాయమాటలు నమ్మరన్నారు. మోసలి కన్నీరు కారుస్తూ గట్టెక్కాలని యత్నం చేస్తున్నారని, ప్రస్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు ఏదోదేదో మాట్లాడుతున్నారన్నారు.

మోడీపై రాహుల్, ప్రియాంక ఒక్క మాటమాట్లాడరని, బీజేపీ, కాంగ్రెస్ దొందుదొందేనని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నాయన్నారు. స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా మోసం చేశాయన్నారు. రైతువ్యతిరేక పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు అని ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ అంటే, మూడు గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ అంటుందన్నారు.

తెలంగాణ రైతులు తస్మత్ జాగ్రత్త.. కాంగ్రెస్ ఇప్పుడు రైతు బంధు అపొచ్చు అని.. ఆలోచన చేయాలని సూచించారు. నాడు కాంగ్రెస్ పార్టీ చెరువులను పట్టించుకోలేదు.. చెక్ డ్యాంలను నిర్మించలేదు.. ప్రాజెక్టులను పట్టించుకోలేదని, నీలం తుఫాన్ వస్తే.. గుంటూరు, కృష్ణాకు వరదసాయం ప్రకటించి.. ఖమ్మం, వరంగల్ కు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed