BRS: గులాబీ లీడర్లలో టెన్షన్.. టెన్షన్..! హైడ్రా నోటీసులతో నిద్రలేని రాత్రులు

by Shiva |
BRS: గులాబీ లీడర్లలో టెన్షన్.. టెన్షన్..! హైడ్రా నోటీసులతో నిద్రలేని రాత్రులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా దూకుడుతో గులాబీ నేతల్లో లబ్ డబ్ మొదలైంది. కూల్చివేస్తామని నోటీసులు ఇస్తుండటంతో నేతలకు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జన్వాడ ఫాం హౌజ్, అనురాగ్ కాలేజీ భవనాలు కూల్చొద్దంటూ కోర్టుకెక్కారు. ఇవన్నీ ఇరిగేషన్ శాఖ ఇస్తున్న నివేదికలతోనే కావడంతో ఆ శాఖ ఎవరిపై ఏం ఫిర్యాదు చేస్తోందనే వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆక్రమణదారులను కూల్చివేతల భయం వెంటాడుతోంది.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాల‌పై హైడ్రా ఫోకస్ పెట్టింది. కూల్చివేతల స్పీడ్ పెంచింది. అందులో కొంతమంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కట్టడాలను ఉన్నట్టు హైడ్రా గుర్తించింది. కూల్చివేస్తామంటూ నోటీసులు సైతం ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్, హెచ్ఎండీఏ అనుమతులు తీసుకొని చెరువులను ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటిని కూల్చుతామని చెరువులను కాపాడటంతో పాటు వాటి పునర్నిర్మాణం చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక ఫోకస్ పెట్టి బీఆర్ఎస్ నేతలకు నోటీసులు వరుసగా ఇస్తుండటంతో.. ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయి.. ఎవరెవరికి నోటీసులు ఇస్తారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

ఇరిగేషన్ శాఖ కదలికలపై బీఆర్ఎస్ నజర్

ఎఫ్టీఎల్ పరిధిలో భూమి ఉందా? బఫర్ జోన్‌లో భూమి ఉందా? లేదా? అనేది డిసైడ్ చేస్తూ.. ఎన్‌వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇరిగేషన్ శాఖ ఇస్తుంది. దానిని బట్టి నిర్మాణాలు చేసుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏ శాఖ సైతం ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ ఇస్తున్న నివేదికల ఆధారంగా హైడ్రా దూకుడు పెంచింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఏ లీడర్ నిర్మాణం చేపట్టారు.. విస్తీర్ణం ఎంతా? అనే వివరాల ఆధారంగానే కట్టడాలను కూల్చివేస్తున్నారు. దీంతో ఆ శాఖ కదలికలపై బీఆర్ఎస్ లీడర్లు ఫోకస్ పెట్టారు. ఏ అధికారి ఎవరిని కలుస్తున్నారు? ఏయే వివరాలను అందస్తున్నారనే వివరాలను గోప్యంగా సేకరించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed