అభ్యర్థుల ఖరారుపై గులాబీ అధినేత ఫోకస్.. ప్రకటించేది అప్పుడే!

by GSrikanth |   ( Updated:2023-05-30 09:56:57.0  )
అభ్యర్థుల ఖరారుపై గులాబీ అధినేత ఫోకస్.. ప్రకటించేది అప్పుడే!
X

గులాబీ పార్టీలో టికెట్ల సస్పెన్స్‌కు మరో నెల రోజుల్లో తెరపడే అవకాశమున్నది. దశాబ్ది ఉత్సవాల తర్వాత అధినేత కేసీఆర్ ఈ విషయంపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. అప్పటివరకు చేయించిన సర్వే రిపోర్టుల ఆధారంగా ఒక్కో ఎమ్మెల్యేను పిలిచి, రివ్యూ నిర్వహించి, నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాతే ఎంత మంది సిట్టింగులకు మళ్లీ ఛాన్స్ వస్తుంది? ఎవరెవరికి టికెట్టు కట్ చేస్తారు? ఎంపీగా పోటీ చేయాలని ఎంత మంది ఎమ్మెల్యేలను ఆదేశిస్తారు? వంటి వాటిపై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సెప్టెంబరు తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వచ్చే అవకాశమున్నది. ఈ లోపే అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. షెడ్యూలు వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడి, అవి పార్టీకి నష్టం తెస్తాయనే అభిప్రాయంలో ఆయన ఉన్నట్టు సమాచారం. జూన్ 2 నుంచి 22 వరకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు అందరూ బిజీగా ఉంటారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపికపై స్వయంగా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇస్తారని తెలుస్తున్నది. రోజుకు కొందరు ఎమ్మెల్యేలను విడివిడిగా పిలిచి, టికెట్ల విషయంపై చర్చిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

నిర్మొహమాటంగా టికెట్ల కత్తిరింపు

ప్రజల్లో నెగిటివ్ ఉన్న సుమారు 35 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే నిర్ణయం ప్రకటించే ముందు వీరితో ఒకసారి ముఖాముఖిగా మాట్లాడే చాన్స్ ఉందని సమాచారం. ప్రజల్లో ఏ మేరకు నెగిటివ్ ఉంది? లోకల్ గా చేసిన అక్రమాలు ఏమిటి? టికెట్ ఇస్తే అపోజిషన్ అభ్యర్థి ఎన్ని ఓట్లతో గెలుస్తారు? అనే విషయాలను వివరించే చాన్స్ ఉంది. అయితే ఈ సందర్భంగా బాధిత ఎమ్మెల్యేలకు మాత్రం ప్రత్యామ్నాయ పదవుల ఆశ చూపే అవకాశముందని సమాచారం. కొందరికి ఎమ్మెల్సీలు, ఇంకొందరికి ఎంపీగా పోటీ చేసే చాన్స్, మరికొందరికి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని హామీలు ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తున్నది.

పేచీలు లేకుండా టికెట్ల కేటాయింపు

చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కంటే ఎక్కువగా లోకల్ లీడర్లు నెగిటివ్‌గా ఉన్నారు. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే గెలుపు కోసం పని చేయలేమని తెగేసి చెప్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ అక్కడ ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం అన్వేషించినా, సిట్టింగ్ కంటే మెరుగైన వారు లేరని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదే విషయాన్ని లోకల్ లీడర్లకు నచ్చజెప్పి, పార్టీ విజయం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేసే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ పక్రియ రాష్ట్ర దశాబ్ది వేడుకులు ముగిసిన తర్వాత మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read...

అదిరిపోయే ఫీచర్స్‌తో.. ఆల్ట్రోజ్ CNG కారు

Advertisement

Next Story

Most Viewed