బీఆర్ఎస్‌కు పొలిటికల్ బెనిఫిటే టార్గెట్.. ‘ట్యాపింగ్’ ఓన్లీ ఫర్ KCR!

by Sathputhe Rajesh |
బీఆర్ఎస్‌కు పొలిటికల్ బెనిఫిటే టార్గెట్.. ‘ట్యాపింగ్’ ఓన్లీ ఫర్ KCR!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు, బీఆర్ఎస్‌ లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్‌ ను బలమైన అస్త్రంగా వాడుకున్నారు కేసీఆర్. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్‌తో మాట్లాడి అడ్వాన్స్ టూల్స్ సమకూర్చుకుని.. విపక్ష నేతలు, జర్నలిస్టులు, జడ్జీల ఫోన్ల వరకు నిఘా పెట్టారు. విపక్షాలకు సహకరించే వ్యాపార, పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియర్లు.. ఇలా అందరి ఫోన్లను ట్యాపింగ్ లిస్టులో ఎక్కించారు. ప్రభాకర్ నేతృత్వంలో 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు ఇది యథేచ్ఛగా కొనసాగింది. ఐ-న్యూస్ చీఫ్ శ్రావణ్ కుమార్, నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌రావు కూడా ఫోన్ ట్యాపింగ్‌లో యాక్టివ్ రోల్ పోషించారు.

అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో పనిచేసిన భుజంగరావు ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఈ విషయాలను వెల్లడించారు. బీఆర్ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ట్యాపింగ్‌ చేసినట్లు స్పష్టం చేశారు. సొంత పార్టీ లీడర్ల కదలికలపైనా నిఘా వేసి.. పబ్లిక్, ప్రైవేటు సంభాషణలు రికార్డు చేసి వివరాలు అందించాలని కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ లీడర్లు ఆదేశించారని తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల నగదును సీజ్ చేయడంలో తమ ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఆ తర్వాత పలు ఉప ఎన్నికల్లోనూ ఇది కంటిన్యూ అయిందని పేర్కొన్నారు.

ప్రతిమ, యశోద ఆస్పత్రుల నుంచి నగదు..

విపక్ష లీడర్ల నగదు రవాణాను అరికట్టడంతోపాటు అప్పటి అధికార పార్టీ ఆర్థిక వ్యవహారాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఎస్ఐబీ తనవంతు సాయాన్ని అందించింది. సొంత పార్టీ గెలుపు కోసం ప్రతిమ, యశోదా ఆస్పత్రుల నుంచి నగదు రవాణా జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆర్థిక అవసరాలను సమకూర్చడం కూడా ఇందులో ఒక టాస్క్. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలు, వ్యాపారవేత్తల సివిల్ మ్యాటర్స్ లో తలదూర్చి ఆర్థిక వనరులను సమకూర్చడంలో రాధాకిషన్‌‌రావు యాక్టివ్ రోల్ పోషించారు. ప్రతిమ, యశోద ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆయన సమన్వయం చేసుకుని నగదును ఒక చోట నుంచి మరో చోటకు తరలించి బీఆర్ఎస్ లీడర్లకు అందజేసే కార్యాచరణను విజయవంతంగా నిర్వహించినట్లు భుజంగరావు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

సంధ్య కన్వెన్షన్ నుంచి రూ. 15 కోట్లు

ఎవరెవరి మధ్య ఎలాంటి వివాదాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని సెటిల్ చేసి ఆర్థిక వనరులు అందుకోవడం కూడా బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ టార్గెట్‌లో ఒక అంశం. హైటెక్ సిటీలో హిందుస్తాన్ పెట్రోలియం బంకు నిర్వహణలో సంధ్యా కన్వెన్షన్ సెంటర్ శ్రీధర్‌రావుకు, టీవీ5 చానెల్‌లో పనిచేస్తున్న సాంబశివరావుకు మధ్య ఉన్న వివాదాన్ని ఎస్ఐబీ టేకప్ చేసింది. అధికార పార్టీతో ఘర్షణ మంచిదికాదన్న ఉద్దేశంతో శ్రీధర్‌రావు ఎలక్టోరల్ బాండ్ రూపంలో రూ. 15 కోట్ల మేరకు బీఆర్ఎస్‌కు విరాళం ఇచ్చారు. వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సాంబశివరావుకు మరో రూ. 2 కోట్లను ముట్టజెప్పారు. కానీ ప్రభాకర్‌రావు బంధువుతోనూ శ్రీధర్‌కు వివాదం ఉండడంతో ఆ చిక్కులు యధావిధిగా కొనసాగాయి. ప్రతిపక్షాల లీడర్లకు చెందిన డబ్బును టాస్క్ ఫోర్స్ తనిఖీల ద్వారా కట్టడి చేసిన రాధాకిషన్‌రావు... అధికార పార్టీకి మాత్రం భారీగానే సమకూర్చడంలో చొరవ తీసుకున్నారని భుజంగరావ్ స్టేట్‌మెంట్‌తో వెల్లడైంది.

వాట్సాప్ గ్రూపులతో సమాచారం షేర్

కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ప్రత్యర్థుల కదలికలపై నిఘా వేసి సమాచారాన్ని షేర్ చేసుకోడానికి ఎస్ఐబీ టీమ్ ప్రత్యేకంగా కేఎంఆర్, పోల్2023 పేర్లతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నది. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిని ట్రాక్ చేసింది. అక్కడి నుంచి రేవంత్‌రెడ్డి కూడా పోటీ చేస్తుండడంతో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి ఫోన్‌పైనా నిఘా వేసింది. తిరుపతన్న ఈ రెండు గ్రూపులను కోఆర్డినేట్ చేసేవాడని, ఫోన్ సంభాషణల ద్వారా ఆ అభ్యర్థుల తరఫున నగదు రవాణా సమాచారాన్ని పసిగట్టడమే దీని ఉద్దేశమని తేలింది. హైదరాబాద్, శివారు ప్రాంతాల నుంచి నగదు కామారెడ్డికి చేరుతుండడంతో ఇక్కడి టాస్క్ ఫోర్స్ పోలీసు విభాగాన్ని ఎస్ఐబీ అలర్టు చేసి ఉంచింది. అయినా కేసీఆర్ అక్కడ ఓడిపోవడంతో తమకు షాక్ కలిగించిందని భుజంగరావు పేర్కొన్నారు.

జర్నలిస్టుల నుంచి జడ్జీల దాకా..

ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌ కుమార్ పూర్తి అధికారాలతో ఫోన్ ట్యాపింగ్ నిర్వహిస్తున్నందున ఎవరెవరి ఫోన్లపై నిఘా వేయాలన్నది ముందుగానే డిసైడ్ అయ్యేది. కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారందరి నెంబర్లూ జాబితాలోకి చేరేవి. జర్నలిస్టుల నుంచి హైకోర్టు జడ్జీల వరకు ఆ లిస్టులో ఉన్నారు. కుల సంఘాల నేతలనూ వదల్లేదు. హైకోర్టు జడ్జి శరత్ కాజా, న్యాయవాదుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. వారి వ్యక్తిగత వివరాలతో పాటు అన్ని కదలికలూ రికార్డయ్యేవన్నారు. ఫోన్ నెంబర్లను, ప్రొఫైల్స్‌ను, వెహికల్ వివరాలను తాను ఇస్తే ప్రణీత్‌రావు ఆ నెంబర్లను ట్యాపింగ్ లిస్టులో పెట్టి రికార్డు చేసేవారని తెలిపారు. వారి మనస్తత్వానికి అనుగుణంగా వారిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం లేదా కంట్రోల్ చేసేవారమన్నారు. ప్రణీత్‌ కుమార్‌కు ప్రభాకర్‌రావు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్నారు.

సొంత పార్టీ లీడర్లపైనా ఇంటెలిజెన్స్

ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా సొంత పార్టీలోని కొంతమంది లీడర్లపైనా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని భుజంగరావు వివరించారు. రాధాకిషన్‌రావును ఎలక్షన్ కమిషన్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా (అక్టోబరు 20న) విధుల నుంచి తప్పించడంతో తమ ఆపరేషన్‌లో ఒడిదుడుకులు వచ్చాయని, చివరకు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యూనిట్ ఆఫీసర్లతో ఆ వెలితిని భర్తీ చేసుకున్నామని, తిరుపతన్న సమన్వయం చేశారన్నారు. సొంత పార్టీలో అసమ్మతితో ఉన్నవారి ఫోన్లనూ ట్యాపింగ్ చేశామని, వారి కదలికలతో పాటు వీక్‌నెస్, స్ట్రెంత్ కు అనుగుణంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. పార్టీ నుంచి ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేసిన తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికలో విస్తృతంగా నిఘాను పెంచామన్నారు. లక్డీకాపూల్‌లోని ఇంటెలిజెన్స్ ఆఫీసులో రెండు మొబైల్ ఫోన్లను, కంప్యూటర్‌ను గతేడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికరులకు రిటర్న్ చేసినట్లు తెలిపారు.

అన్ని ఉప ఎన్నికల్లోనూ సర్వియలెన్స్

ఫోన్ ట్యాపింగ్, ఇంటెలిజెన్స్ నిఘా 2018 అసెంబ్లీ ఎన్నికలతో మొదలైందని, ఆ తర్వాత 2019లో లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కంటిన్యూ అయిందని భుజంగరావు తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన, నిరసన కార్యక్రమాల వివరాలను కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ల లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ ద్వారా పసిగట్టామన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారం కూడా ఈ టాస్క్‌లో భాగంగానే జరిగిందన్నారు. ఇలాంటి అన్ని సందర్భాల్లో తాను ఇన్‌పుట్స్‌తో పాటు ఫోన్ నెంబర్లు, ఫొటోలు, వాహనాల వివరాలను ఇస్తే ప్రణీత్‌కుమార్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టేవారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా డీజీపీ, అదనపు డీజీపీలకు తెలియకుండానే ప్రభాకర్‌రావ్ కనుసన్నల్లో జరిగిందన్నారు.

Advertisement

Next Story