బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే

by Nagaya |
బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనను పక్కన పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సునితా లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మెదక్ ఎంపీగా అవకాశం కల్పిస్తామని మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తీరా ఆ స్థానాన్ని మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డికి ఇవ్వడంతో మదన్ రెడ్డి నారాజ్ అయ్యారు. స్వయంగా పార్టీ అధినేత ఇచ్చిన హామీలకు కూడా బీఆర్ఎస్‌లో విలువ లేదని ఆయన తన సన్నిహితులు వద్ద అసహనం వ్యక్తం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోగా మాజీ మంత్రి హరీష్ రావు నచ్చజెప్పడంతో విరమించుకున్నారు. ఇటీవలే నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన విషయం తెలిసిందే. పార్టీ కోసం కట్టుబడి పనిచేసే తనలాంటి బలమైన కేడర్ ఉన్నా వారిని పక్కన పెట్టి సీఎంను కలిసి రావడంతో పాటు ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా పార్టీ పట్టించుకోవడం లేదని సన్నిహితుల వద్ద ఆగ్రహం చేశారు.

మైనంపల్లితో మదన్ రెడ్డి భేటీ

మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో మదన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. మదన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న తరువాతే ఆయన వద్దకు వెళ్లి చర్చలు జరపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో మదన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎంపీ ఎన్నికల వేళ మదన్ రెడ్డి నిర్ణయం బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed