BC CM: తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్.. బీసీల ఆశలపై బీఆర్ఎస్ నీళ్లు!

by Prasad Jukanti |   ( Updated:2025-02-19 13:00:56.0  )
BC CM: తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్.. బీసీల ఆశలపై బీఆర్ఎస్ నీళ్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో వేగంగా ఈక్వేషన్స్ మారుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే విభిన్నాస్త్రాలు తెరపైకి తెస్తూ సిట్యుయేషన్ ను మరింత రంజుగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో బీసీ ముఖ్యమంత్రి అంశం రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. రాష్ట్రంలో కులగణన చేసిందే తామేనని, బీసీ ముఖ్యమంత్రి (BC CM) మాతోనే సాధ్యం అని కాంగ్రెస్ చెబుతుంటే కేంద్రంలో ఇప్పటికే ప్రధాన మంత్రి బీసీ ఉన్నారని రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎంను చేస్తామని బీజేపీ చెబుతోంది. జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం బీసీ బిడ్డనే ఉంటాని బీసీ నేతలంతా బలంగా విశ్వసిస్తున్న తరుణంలో ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే మాట మీద ఉంటే బీఆర్ఎస్ (BRS) మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది.

కాంగ్రెస్, బీజేపీలకు భిన్నంగా బీఆర్ఎస్:

1956 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క బీసీ వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. మొదటి ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత దాదాపు 12 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రులు అయ్యారు. ఆరు సార్లు కమ్మ, మూడు సార్లు వెలమ, ఎస్సీ, బ్రాహ్మణ, వైశ్య వర్గ నేతలు ఒక్కోసారి సీఎం పీఠం అధిరోహించారు. టి. అంజయ్య విషయంలో బీసీ అని కొందరు.. రెడ్డి అని కొందరు వాదిస్తున్నారు. ఈయనొక్కరి విషయం అలా ఉంచితే జనాభాలో ౫౦ శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలు ఇప్పపటికీ పాలితులుగానే ఉంటున్నామని ఆ వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. దీంతో ఈసారి తెలంగాణలో బీసీ వ్యక్తే ఉండాలనేది ఆ వర్గాల బలమైన ఆకాంక్ష. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాలేము అనే కాన్సెప్ట్ తో బీసీ నేతలు బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రధాన పార్టీలు ఈ విషయంలో తమ వైఖరి ఏంటో తేల్చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని గత ఎన్నికల్లోనే ప్రకటించిన బీజేపీ ఇప్పటికే అదే స్టాండ్ మీద ఉన్నామనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. ఇక మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ (Congress) పార్టీ సీఎం క్యాండిడేట్ గా బీసీ వ్యక్తినే ఉంటారని టీపీసీసీ చీఫ్ తేల్చేశారు. ఈ విషయంలో తానే చివరి ఓసీ ముఖ్యమంత్రిని అయినా పర్వాలేదు అని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టేశారు. కానీ తాము బీసీల పక్షం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ లో మాత్రం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. మా పార్టీ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే అని బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్ రావు, కేటీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇవాళ జరిగిన పార్టీ విస్తృత సమావేశం వేళ క్యాడర్ కూడా కేసీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ కు బీసీ ముఖ్యమంత్రి ఇష్టం లేదా అందులో భాగంగానే కేసీఆరే మా సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది.

తాజా నినాదాల వెనుక వ్యూహం ఏంటి?

రాష్ట్రంలో బీసీల విషయంలో క్రెడిట్ పాలిటిక్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. కులగణన తో తాము బీసీల లెక్కలు బయటకు తీయగలిగామని కాంగ్రెస్ చెబుతుంటే ఈ లెక్కలన్ని తప్పుల తడక అని బీజేపీ(BJP), బీఆర్ఎస్ విమర్శిస్తుంటే వీటికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ సర్వే కోసం మరో అవకాశం కల్పించింది. గతంలో ప్రజలు సర్వేలో పాల్గొనకుండా చేసిందే బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అని టార్గెట్ చేస్తోంది. ఇక బీసీల్లో ముస్లింలను ఎలా కలుపుతారంటూ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. మొత్తంగా బీసీల అంశంలో ఎవరి క్రెటిడ్ స్కోర్ పాలిటిక్స్ వారు కొట్టేసే ప్రయత్నం చేస్తుంటే సీఎం విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ ఒంటరిగా మారుతుండటం భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది. ఇక కాంగ్రెస్ ఇప్పటికే బీసీ వ్యక్తిని పీసీసీగా నియమించగా బీజేపీ సైతం బీసీ వ్యక్తికే పగ్గాలు అప్పగించబోతున్నదనే టాక్ వినిపిస్తోంది. బీసీల విషయంలో ఈ రెండు పార్టీలు పోటాపోటీగా నిర్ణయాతు తీసుకుంటుంటే బీఆర్ఎస్ లో మాత్రం మా అధినేత కేసీఆరే కాబోయే సీఎం అని చెప్పడం వెనుక మతలబు ఏంటి అనేది చర్చగా మారింది. కేసీఆర్ అంటేనే ఓట్లు పడతాయని ఆ పార్టీ భావిస్తోందా లేక బీసీ నినాదంతో వెళ్తే వర్కౌట్ కాదనే నిర్ణయానికి వచ్చిందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు పొలిటికల్ కారిడార్ లో బలంగా వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed