కేసీఆర్‌కు మరో బిగ్ షాక్.. కీలకమైన ఎల్పీ మీటింగ్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా..!

by Satheesh |
కేసీఆర్‌కు మరో బిగ్ షాక్.. కీలకమైన ఎల్పీ మీటింగ్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా..!
X

దిశ, వెబ్‌డెస్క్: గులాబీ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్ వేదికగా జరుగుతోన్న ఈ కీలక భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రైతు భరోసా, నిరుద్యోగుల ఆందోళన, రూ.2 లక్షల రుణమాఫీకి నిబంధనలు విధించడం, ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలను హైలెట్ చేస్తూ సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని నేతలకు కేసీఆర్ సూచించినట్లు టాక్.

అయితే, కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ కీలక భేటీకి ఐదుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఐదుగురు ఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్య రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకటరామిరెడ్డి, గోరేటి వెంకన్న, వెంకట్రాంరెడ్డి ఎల్పీ మీటింగ్‌కు అటెండ్ అవ్వలేదు.

ఎల్పీ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముందుగానే అందించినప్పటికీ వీరు హాజరుకాకవపోవడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. స్వయంగా పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరైన సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎల్పీ సమావేశానికి గైర్హాజరైన వారిలో కొందరు పార్టీ మారబోతున్నట్లు గత కొంత కాలంగా పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వీరు కీలకమైన ఎల్పీ సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీ మార్పు వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.



Next Story