కర్ణాటక ఫలితాలతో బీఆర్ఎస్ ​అలర్ట్.. ఆ విషయాలపై ఆరా..!

by Javid Pasha |   ( Updated:2023-05-14 14:10:06.0  )
కర్ణాటక ఫలితాలతో బీఆర్ఎస్ ​అలర్ట్.. ఆ విషయాలపై ఆరా..!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కర్ణాటక ఫలితాలతో బీఆర్ఎస్ అలర్టయ్యింది. బీజేపీ ఓటమి ఆ పార్టీ వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తున్నా ఊహించని విధంగా కాంగ్రెస్​గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకోవటం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్​యాభై శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవటం పార్టీకి డేంజర్​బెల్సా? అన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కాంగ్రెస్​విజయానికి కారణాలు ఏమిటి? రాష్ర్టం మొత్తం మీద ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? కర్ణాటక గెలుపు తెలంగాణలో ప్రభావం చూపనుందా? అన్న అంశాలపై సమాచారాన్ని సేకరిస్తోంది. దీనికోసం ఇప్పటికే ఇంటెలిజెన్స్​వర్గాలను రంగంలోకి దింపినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో ఎన్నికల హీట్​ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. హ్యాట్రిక్​సాధిస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంటే ఈసారి విజయం మాదేనని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్​నేతలు తెలంగాణలో ఈసారి ప్రభుత్వాన్ని తమ పార్టీయే ఏర్పాటు చేస్తుందని అంటున్నారు.

తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, నిరుద్యోగం, పంట కొనుగోళ్లు, ఓఆర్ఆర్ కాంట్రాక్టును తక్కువకే కేటాయించటం ఇలా దొరికిన ప్రతీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూ బీఆర్ఎస్ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు పర్సంటేజీలు తీసుకున్నట్టుగా తన వద్ద సమాచారం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్​సొంత పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో వ్యాఖ్యానించారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హోరాహోరీగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరులో కాంగ్రెస్​అనూహ్యంగా పూర్తి మెజారిటీతో విజయాన్ని సాధించటం బీఆర్ఎస్​వర్గాల్లో కలవరాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా

హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలో మొత్తం 41 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్​24 స్థానాల్లో విజయబావుటా ఎగురవేయటం ఆ పార్టీ నాయకుల్లో ఆందోళనను కలిగిస్తోంది. పైకి కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉండదని చెబుతున్నా లోలోపల మాత్రం కాంగ్రెస్​కర్ణాటకలో ఇంత బలంగా పుంజుకోవటం వెనక ఉన్న కారణాలేమిటన్న అంశంపై బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు​కర్ణాటకలో హంగ్​ఏర్పడవచ్చని బీఆర్ఎస్ నాయకులు భావించారు. తమ మిత్రడు, జేడీఎస్​పార్టీ అధ్యక్షుడు అయిన కుమారస్వామి ప్రభుత్వ ఏర్పాటులో కింగ్​మేకర్​కాగలడని అనుకున్నారు. అయితే, ఈ అంచనాలు పూర్తిగా తలకిందులు కావటంతో బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్​వర్గాలను రంగంలోకి దింపినట్టుగా సమాచారం. హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్​అభ్యర్థుల విజయానికి కారణాలు ఏమిటి? స్థానిక పరిస్థితులా? రాహుల్​గాంధీ జరిపిన భారత్​జోడో యాత్ర ప్రభావమా? ఆ పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరగటమా? అన్న అంశాలకు సంబంధించి వివరాలు తెప్పించుకుంటున్నారు.

అదే సమయంలో రాష్ర్టంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్.. బీజేపీ పార్టీలు ఎక్కడెక్కడ బలంగా ఉన్నాయి? అన్న సమాచారాన్ని కూడా ఇంటెలిజెన్స్​వర్గాల ద్వారా సేకరిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏ మేరకు ఉందన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్​విభాగానికి చెందిన ఓ అధికారితో మాట్లాడగా ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి సమాచారాన్ని సేకరించటం సర్వసాధారణమేనని వ్యాఖ్యానించారు. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్​ఓట్ల శాతం పెరగటం, పూర్తి మెజారిటీని సాధించటం కొంతమేర అధికార పక్షంలో ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరింత నిశితంగా ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తోందన్నారు.

Also Read..

ఎన్నికల తర్వాత.. ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటాము: కాంగ్రెస్

Advertisement

Next Story