BRS: పోలీసులను హరీష్ రావు అలా అనలేదు.. బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
BRS: పోలీసులను హరీష్ రావు అలా అనలేదు.. బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హరీష్ రావు వ్యాఖ్యలను పోలీసు అధికారులు తప్పుగా అర్ధం చేసుకన్నారని, పోలీసులపై మాకు గౌరవం ఉందని, కేసీఆర్ హయాంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ లో అనేక సంస్కరణలు జరిగాయని బీఆర్ఎస్ నేత జి. దేవిప్రసాద్ అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావు పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. హరీష్ రావు ప్రజలకు సంబంధించిన అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై నిన్న హరీష్ రావు మాట్లాడారని, పోలీసు వ్యవస్థను ప్రభుత్వం కుప్పకూల్చిందని ఆయన అన్నారని తెలిపారు. పోలీసు అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారని, పోలీసులు, పోలీసు అధికారుల పట్ల మాకు గౌరవం ఉందని చెప్పారు.

హరీష్ రావు నిరంతరం ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యల పట్ల మాట్లాడుతున్నారని, పోలీసు అధికారులు కొంతమంది ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో నలుగురు మాజీమంత్రులు పర్యటన చేస్తే దాడులు జరిగాయని, దానిపై కనీసం పోలీసులు స్పందించలేదన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలీసు డిపార్ట్మెంట్‌లో అనేక సంస్కరణలు జరిగాయని, పోలీస్ స్టేషన్లకు స్టేషనరీ ఖర్చులు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. అలాగే పోలీసులకు కొత్త ఇన్నోవాలు ఇచ్చారని, 47 వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్ నియామకం జరిగిందని గుర్తు చేశారు. శాంతిభద్రతల వైఫల్యం ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నామని, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకటి రెండు మినహా ఎన్ కౌంటర్లు జరగలేదని, కాంగ్రెస్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్ కౌంటర్లు ప్రారంభం అయ్యాయని దేవి ప్రసాద్ ఆరోపించారు.

అలాగే మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టీచర్స్ అవార్డ్స్‌లో పారదర్శకత లేదని, ప్రతి జిల్లా నుండి నలుగురు టీచర్లను ఎంపిక చేయాలని సూచించారు. అలాగే పీ.వి.నరసింహారావు గురుకుల వ్యవస్థను ఏర్పాటు చేశారని, గురుకుల పాఠశాలల్లో చదువుకున్న వారు ప్రతిభ కనబర్చుతున్నారని తెలిపారు. ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గురుకుల పాఠశాలల స్థాయిని పెంచారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గురుకుల పాఠశాలలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. తెలంగాణలో 194 ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు వారిని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించకుండా ప్రత్యేక ఉపాధ్యాయులుగా గుర్తిస్తున్నారని అన్నారు. ఆదర్శ పాఠశాలలను ప్రభుత్వ స్కూల్స్ గా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు శాంతిభద్రతల సమస్య రావద్దని, ప్రభుత్వ విధానం ప్రకారమే పోలీసులు నడుచుకుంటారని చెప్పారు. ఇక రైతు భరోసా ప్రస్తావన రాష్ట్రంలో లేకుండా పోయిందని, ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని పలు విమర్శలు చేశారు.

Advertisement

Next Story