ఎంట్రీ కోసమే చేరికలపై ఫోకస్.. ప్రాతినిధ్యం కోసం బీఆర్ఎస్ పాకులాట

by Mahesh |   ( Updated:2023-02-15 03:33:54.0  )
ఎంట్రీ కోసమే చేరికలపై ఫోకస్.. ప్రాతినిధ్యం కోసం బీఆర్ఎస్ పాకులాట
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌ను దేశమంతటా విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇందుకు అక్కడి మాజీ ప్రజాప్రతినిధులే టార్గెట్‌గా చేరికలపై ఫోకస్ పెట్టారు. గతంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం ఆయా పార్టీల్లో ప్రాధాన్యత తగ్గిన వారితో మంతనాలు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు జరిపారు.

కొందరి మాజీలకు గులాబీ కండువాను కప్పి వారికే ఆయా రాష్ట్రాల పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు గులాబీ బాస్. ఆయా రాష్ట్రాల్లో ఏ మేరకు ప్రభావం అని చూపుతారని కాకుండా ఆ రాష్ట్రాల్లో ఎంట్రీ కోసమే మొదటి అడుగు వేస్తున్నారు. బీఆర్ఎస్ కు ప్రతినిధిగా ఎవరో ఒకరు ఉండాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందుకోసం మాజీలను ప్రత్యేకంగా పిలిపించుకొని ప్రగతిభవన్‌లోనే భేటీ అవుతున్నారు.

వారి దారి ఖర్చులను సైతం కేసీఆర్ భరిస్తుండటం గమనార్హం. వారితో పాటు రైతు సంఘం నేతలతోనూ గతంలోనే సంప్రదింపులు చేయడంతో తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమాన్ని క్షేత్రస్థాయి పర్యటనలో చూపించారు. ఇప్పటివరకు గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవర్, మాజీ పీఎం దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, మహారాష్ట్ర మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే, ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింత పార్థసారధితో పాటు 25 రాష్ట్రాల రైతు సంఘం నేతలతో సంప్రదింపులు చేశారు. బీఆర్ఎస్ నినాదం, సిద్ధాంతాలను వివరించారు.

ప్రగతి భవన్ వేదికగా..

బీఆర్ఎస్ విస్తరణకు ప్రగతి భవన్ వేదికైంది. అక్కడి నుంచే పార్టీ బలోపేతంపై నిత్యం చర్చలు జరుపుతున్నారు. మాజీ ఐఏఎస్, సుప్రీం, హై కోర్టు జడ్జీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులు, రాజకీయ వేత్తల సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ నినాదంతో ముందుకు వెళ్లాలి, అక్కడి సమస్యలు ఏమిటి?, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏమిటి? అనే వివరాలను సైతం సేకరిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎలా వారి ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపైనా చర్చిస్తున్నారు.

కొందరికీ గులాబీ కండువాలు

కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయమే బీఆర్ఎస్ పార్టీ స్థాపన అంటూ కేసీఆర్ ప్రకటిస్తూ ఆ దిశగానే దేశ రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ పార్థసారధిలకు గులాబీ కండువా కప్పారు. అంతేకాదు చంద్రశేఖర్ కు ఏపీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను సైతం బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.

ఫిబ్రవరి 5న మహారాష్ట్ర నాందేడ్‌లో నిర్వహించే సభలో సైతం మాజీ సీఎంలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వారు ఆయా రాష్ట్రాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారనేది కాకుండా ఆ రాష్ట్రంలో ప్రాతినిధ్యమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారు.

ఇవి కూడా చదవండి : పొత్తు పాలిటిక్స్..! బీఆర్ఎస్‌లో టెన్షన్?

Advertisement

Next Story

Most Viewed