బిగ్ బ్రేకింగ్ : పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు

by Rajesh |   ( Updated:2023-02-15 03:11:29.0  )
బిగ్ బ్రేకింగ్ : పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు
X

దిశ, మెట్టుగూడ: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌ - ఘట్కేసర్ స్టేషన్ల మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్‌(ట్రైన్ నెంబర్ 12727) కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు బీబీనగర్‌ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. రైలులోని S1, S2, S3,S4 (రిజర్వేషన్ కోచ్‌లు) మరియు జనరల్ కోచ్ మొత్తం ఐదు బోగీలు పట్టాలపై నుంచి పక్కకు జరిగాయి.

దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులలు సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై అరా తీస్తున్నారు. బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించి అదే ట్రైన్‌కు జతచేశారు.

ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులను బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపిచామన్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో సికింద్రాబాద్ వైపు వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఘటనా స్థలంలో రైళ్ల రాకపోకలకు పునరుద్ధరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 040-27786666 ఏర్పాటు చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు నూతన టెక్నాలజీ LHB కోచ్‌లను ఏర్పాటు చేశారు. దీనివల్ల పట్టాలు తప్పినప్పుడు ఆటోమేటిక్‌గా బోగీలకు బ్రేక్ పడుతుంది. పెద్ద ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు. ప్రమాద స్థలానికి దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed