BREAKING : కేటీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టు నోటీసులు

by Rajesh |   ( Updated:2024-06-14 16:56:59.0  )
BREAKING : కేటీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్ / తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌తో పాటు కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్‌లో వాస్తవాలను దాచిపెట్టారని, తప్పుడు సమాచారాన్ని పొందుపరిచారని, దీనిపై విచారణ జరిపించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కేకే మహేందర్‌రెడ్డి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా అదే నియోజకవర్గానికి చెందిన ఓటర్‌గా లగిశెట్టి శ్రీనివాస్ సైతం వేరే పిటిషన్‌ను దాఖలు చేసి అందులో కేటీఆర్ అఫిడవిట్‌లోని తప్పుడు సమాచారంపై ఆరోపణలు చేశారు. ఈ రెండు పిటిషన్‌లను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారించి కేటీఆర్‌కు నోటీసులు జారీచేశారు. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులు ఇచ్చారు.

అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందున సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్‌ను అనర్హడిగా ప్రకటించాలని వారిద్దరూ పిటిషన్లలో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్ కొన్ని వాస్తవాలను అఫిడవిట్‌లో పొందుపర్చకుండా తొక్కిపెట్టారన్నది వారిద్దరి ఆరోపణ. లగిశెట్టి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌లో కేటీఆర్ కుమారుడు హిమాన్షు ప్రస్తావన చేశారు. ప్రస్తుతం హిమాన్షు తనపైన ఆధారపడనందున తన డిపెండెంట్‌గా లేరని, గతేడాది జూలై 12 నుంచి మేజర్‌గా ఉన్నారని, కేవలం భార్య, కుమార్తె మాత్రమే డిపెండెంట్లుగా ఉన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారని లగిశెట్టి శ్రీనివాస్ వివరించారు.

హిమాన్షు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో సుమారు రూ. 10.50 లక్షల విలువైన 32 ఎకరాల భూమిని, ఇదే మండలంలోని ఎర్రవల్లిలో రూ. 88.15 లక్షల విలువైన 365 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. మేజర్‌గా మారిన కొన్ని నెలల వ్యవధిలోనే హిమాన్షు ఇంత పెద్ద మొత్తంలో సంపదను ఎలా ఆర్జించారోననే సందేహాన్ని వ్యక్తం చేశారు. తండ్రితో సంబంధం లేకుండా ఆర్జించి ఉండడంపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. వీటిని కేటీఆర్ తన అఫిడవిట్‌లో పొందుపర్చలేదని పేర్కొన్నారు. ఈ రెండు పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు... నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ అధికారులకు కూడా వివరాలు అందించాలని నోటీసులు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed