సస్పెన్షన్ ఎత్తి వేయని బీజేపీ.. గోషా మహల్ నుంచి రాజాసింగ్ పోటీ డౌటేనా?

by GSrikanth |   ( Updated:2022-12-04 23:30:31.0  )
సస్పెన్షన్ ఎత్తి వేయని బీజేపీ.. గోషా మహల్ నుంచి రాజాసింగ్ పోటీ డౌటేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజాసింగ్‌పై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సస్పెన్షన్ ఎత్తివేతపై ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో ఇప్పుడు రాజాసింగ్ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో అనే చర్చ జరుగుతున్నది. పార్టీ డెసిషన్ చెప్పాక అసెంబ్లీ నుంచి బరిలో దిగాలా? పార్లమెంట్ కు పోటీ చేయాలా అని నిర్ణయించుకుంటానని సన్నిహితుల వద్ద ప్రస్తావించించినట్లు తెలిసింది. మరోవైపు గోషా మహల్ లో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు..

కాంట్రవర్సీ స్టేట్ మెంట్ తో కటకటాలపాలైన రాజాసింగ్ బయటకు వచ్చినా, బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం సస్పెన్షన్ ను ఇంకా ఎత్తివేయలేదు. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి చేరిక సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలో కూడా రాజాసింగ్ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. గోషామహల్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను అమిత్ షా కూడా తప్పుపట్టినట్లు తెలిసింది. రాజాసింగ్ పై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా ఉన్నప్పటికీ, సస్పెన్షన్ వేటుపై అధిష్టానం ఇప్పట్లో నిర్ణయం ప్రకటించే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. రాజాసింగ్ పై బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బీజేపీ నేతలతో రాజాసింగ్ కు విభేదాలున్నాయి. అదే ఇప్పుడు రాజాసింగ్ కు, పార్టీకి మధ్య అగాథం పెంచుతున్నట్లు టాక్. కేంద్ర పార్టీలోనూ రాజాసింగ్ కు సపోర్ట్ గా నిలిచే వారు ఉన్నప్పటికీ బహిరంగంగా బయటకు వచ్చి మద్దతు తెలపలేని పరిస్థితి ఏర్పడింది.

పార్లమెంట్ స్థానానికి పోటీపై ఆసక్తి

రాజాసింగ్ ఈ సారి జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే పలువురు సన్నిహితుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. జహీరాబాద్ లో లింగాయత్ ల ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో సులువుగా గెలవచ్చిన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని గతంలో రాజాసింగ్ మీడియాతో పలుమార్లు ప్రస్తావించారు.

గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్న విక్రమ్

గోషామహల్ నుంచి బరిలో దిగేందుకు మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ గ్రౌండ్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉండగా నియోజకవర్గంలో తిరిగితే పార్టీకి చెడ్డపేరు వస్తుందనే నేపథ్యంలో పార్టీ లైన్ దాటకుండా విక్రమ్ తన పని తాను చేసుకుపోతున్నట్లు వినికిడి. ఇప్పటికే తన తండ్రి ముఖేశ్ గౌడ్ కు సన్నిహితులుగా ఉన్నవారిని కలిసి అండగా నిలవాలని కోరుతున్నట్లు సమాచారం. రాజాసింగ్ నియోజకవర్గంలోని పలు హైందవ కార్యక్రమాలకు పరిమితమయ్యారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో రాజాసింగ్ వ్యూహం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. దీనికితోడు గ్రౌండ్ లోకి ఎంటరై తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న విక్రమ్ గౌడ్ కు లైన్ క్లియర్ అవుతుందా లేదా అనేది కూడా వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story