వరద ప్రాంతాల్లో బీజేపీ పర్యటన

by Mahesh |
వరద ప్రాంతాల్లో బీజేపీ పర్యటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరద బాధిత ప్రాంతాలకు బీజేపీ నేతలు ఎట్టకేలకు వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 6వ తేదీన బీజేపీ రెండు బృందాలుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. మరో బృందానికి ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ నేతృత్వం వహించనున్నారు. బండి సంజయ్ నేతృత్వంలో ఉన్న బృందం ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పర్యటించనుంది. కాగా, ఆయన టీమ్ లో పైడి రాకేశ్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఈటల బృందం మహబూబాబాద్, ములుగు ప్రాంతాల్లో పర్యటించనుండగా, ఆ టీమ్ లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తదితరులు ఉండనున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ బృందాలు స్థానిక ప్రజలకు, రైతులకు ధైర్యం చెబుతూ పలు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed