అప్పుడు అవమానపరిచి.. ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారా?: బండి సంజయ్

by GSrikanth |
అప్పుడు అవమానపరిచి.. ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారా?: బండి సంజయ్
X

దిశ, కరీంనగర్ బ్యూరో: రాష్ర్టపతి ఎన్నికల సమయంలో మహిళ అని చూడకుండా ఓడించాలని ప్రయత్నం చేసిన ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవం విషయంలో ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్‌లో శ్రీమహాశక్తి అమ్మవారి ఆలయ వార్షికోత్సవానికి హజరైన బండి సంజయ్ అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ర్టపతి ఎన్నికల సమయంలో ప్రస్తుత రాష్ర్టపతి దౌపద్రి మూర్మును ఓడించే ప్రయత్నం చేసింది ప్రతిపక్ష పార్టీలు కాదా? అని ప్రశ్నించారు. ఒక మహిళ అని చూడకుండా ఓడించే ప్రయత్నం చేసి అవమానపరిచి ఇప్పుడు పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ స్పీకర్ నిర్ణయం ప్రకారమే ఏకార్యక్రమైన జరుగుతుందని సంజయ్ స్పష్టం చేశారు.

జీతాలు ఇచ్చే పరిస్థితి లేదుకాని..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదుకాని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​రూ.150కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను చర్చకు రాకుండా ఉండేందుకు దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం హడావిడి చేస్తుందని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేదని ఇలాంటి సమయంలో దశాబ్ది ఉత్సవాలు ఎందుకని ప్రశ్నించారు. ఢిల్లీ తరహాలో తెలంగాణలో సైతం లిక్కర్​దందా సాగిందని ఇందులోను కేసీఆర్​కుటుంబ సభ్యులు ఉన్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాల్లో లిక్కర్ దందా చేసినోళ్లు తెలంగాణలో చేయలేరా? అని అన్నారు. తెలంగాణ లిక్కర్ దందాపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్లీ బీఆర్‌ఎస్‌కే

రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని సంజయ్ అన్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరారని మరో నాలుగు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నారని అన్నారు. కర్ణాటకలో గెలిస్తే గాంధీ భవన్‌లో తప్ప ఎక్కడా సంబురాలు చేసుకునే పరిస్థితి లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ గెలిచే పరిస్థితి లేదని జీఎచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించిందని అన్నారు.

ఎలాంటి విభేదాలు లేవు..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్‌తో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఓ సెక్షన్ మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని బండి సంజయ్​అన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న బీజేపీకి మీడియా సహకరించాలని కోరారు. గ్రానైట్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని కేవలం ఆరోపణలు మాత్రమేని సంజయ్​ కొట్టి పారేశారు. తనకు గ్రానైట్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన వారు అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని తాను ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ అన్నారు.

Advertisement

Next Story