బీజేపీ డిజిటల్ ప్రచారం.. పెరిగిన సోషల్ మీడియా యాక్టివిటీ

by Mahesh |
బీజేపీ డిజిటల్ ప్రచారం.. పెరిగిన సోషల్ మీడియా యాక్టివిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని వినియోగించుకోవడంలో బీజేపీ పెట్టింది పేరు. హిందూ ధర్మం, పార్టీ సిద్ధాంతాల విషయంలో ముందుండే కాషాయదళం డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ ఇతర పార్టీలతో పోలిస్తే ముందు వరుసలోనే ఉంది. భవిష్యత్తు అంతా సోషల్ మీడియాదే అని ఈ పార్టీ గతంలో నుంచే డిజిటల్ వేదికగా ప్రచారం చేపట్టారు. తెలంగాణలో ఈ ఏడాది చివరినాటికి ఎన్నికలున్న నేపథ్యంలో డిజిటల్ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. క్రమంగా యాక్టివిటీని పెంచే పనిలో రాష్ట్ర నాయకత్వం తలమునకలై ఉంది. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల పేరిట పలు ప్లాట్ ఫాంల్లో ఖాతాలు క్రియేట్ చేస్తున్నది. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళిక రూపొందించుకుంది.

తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో కాషాయదళం చాప కింద నీరులా కార్యకలాపాలు చేపడుతున్నది. యువతను రీచ్ అయ్యేందుకు మాధ్యమంగా సోషల్ మీడియాను ఎంచుకున్నది. ఇందుకు ఒక ప్రత్యేకంగా కమిటీ వేసుకుంది. ఇప్పటికే భవిష్యత్‌లో చేపట్టే కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ప్రజలకు ఏదో ఒక రూపంలో చేరువయ్యేందుకు ఇప్పటికే కమలదళం విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నది.

అందులో భాగంగా 15 రోజుల్లో 11 వేల వీధి సభలను నిర్వహిస్తున్నది. దీనికి తోడు యువతను ఆట్రాక్ట్ చేయడంపై దృష్టిసారిస్తున్న కమలనాథులు సోషల్ మీడియాలో యాక్టివిటీని పెంచేసింది. పలు నినాదాలతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ప్రజలను చేరువయ్యే పనిలో పడింది. సాధారణ ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం కూడా లేదు. అందుకే ఇప్పటి నుంచే క్రమంగా ప్రజల్లోకి చొచ్చకు వెళ్లడంపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారిస్తున్నది. అందులో భాగంగానే సోషల్ మీడియా వింగ్ ఇప్పటికే ప్రముఖుల పేరిట ఖాతాలు క్రియేట్ చేసింది. ఆయా ప్రాంతాల వారీగా పేరున్న నేతల లిస్టును సిద్ధం చేసుకుని వారి పేరిట పలు మాధ్యమాల్లో ఖాతాలను ఈ బృందం తెరుస్తున్నది.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని బతికించుకోవాలంటే బీజేపీకి మద్దతు తెలపాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలని పలువురి ఖాతాల నుంచి పోస్టులు చేస్తున్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మరింత ఎక్కుపెట్టనుంది. సీఎం ఇచ్చిన హామీలు, వాటి అమలు విషయాల్లోనూ దూకుడుగా వ్యవహరించేలా ఈ సోషల్ మీడియా వింగ్ పనిచేయనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పలు మీడియా సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. సీఎం చెప్పిన వార్తలు తప్పితే అందులో ఇతర రాజకీయ నేతల అంశాలకు అంత ప్రాధాన్యం ఉండదనే ప్రచారం ఉంది.

ఒకవేళ ఎవరైనా మాట వినికపోతే బ్లాక్ మెయిల్ చేసి అయినా వారిని తమ గుప్పిట్లో పెట్టుకుంటారని టాక్. అందుకే బీజేపీ సోషల్ మీడియాను అస్త్రంగా ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీ అధికారం చేజిక్కించుకునేందుకు ఇది ఎంతమేరకు ఉపయోగపడుతుందనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed