గవర్నర్ ప్రతిష్టను దిగజార్చేలా స్క్రిప్ట్: పాయల్ శంకర్

by GSrikanth |
గవర్నర్ ప్రతిష్టను దిగజార్చేలా స్క్రిప్ట్: పాయల్ శంకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం గ్యారెంటీ లేని ప్రసంగమని, గవర్నర్ ప్రతిష్టను దిగజార్చేలా స్క్రిప్ట్ తయారు చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు చేశారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కాళోజీ సూక్తిని జవదాటదని, నీతివంతమైన పాలన అందిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో సోనియా గాంధీ గురించి మాత్రమే ఉందని, తెలంగాణ కోసం అమరులైన వారిని గౌరవిస్తామని, స్వరాష్ట్ర సాధనలో సుష్మా స్వరాజ్ పాత్ర గురించి లేకపోవడం ప్రభుత్వం కుంచిత తత్వం బయటపడుతోందని ఫైరయ్యారు. అధికారం రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక చెబుతున్న మాటలకు పొంతన లేకుండా ఉందని శంకర్ మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంచామని చెప్పిన ప్రభుత్వం వేల దరఖాస్తులను ఎందుకు పెండింగ్‌లో పెట్టిందని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉందని, ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిర్బంధంలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. ఒకటో తారీకు జీతాలివ్వడం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ భాధ్యత కాదని, అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు చేస్తామని ప్రకటించారని, ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలని పాయల్ శంకర్ నిలదీశారు. ఇప్పటి వరకు 60 శాతం మంది రైతులకు రుణ మాఫీ జరగలేదని ఆయన వివరించారు. కాంగ్రెస్ కూడా గత ప్రభుత్వ తీరునే అనుసరిస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అంటున్నారని, అదే నిజమైతే బీఆర్ఎస్ ను ఓడించింది ఎవరనేది గమనించాలని పాయల్ శంకర్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ తీరే ఈ ప్రభుత్వం అనుసరిస్తే ప్రజలు క్షమించబోరని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed