అసదుద్దీన్‌కు కోపం వస్తుందనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.. ఏలేటి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-04 15:12:18.0  )
అసదుద్దీన్‌కు కోపం వస్తుందనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.. ఏలేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరద నష్టంపై రెండు కేంద్ర బృందాలు రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేస్తున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి(Alleti Maheshwar Reddy) తెలిపారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు కేంద్రం మూడు లక్షల ఎక్సిగ్రేసియా ప్రకటించిందని గుర్తుచేశారు. రెండు రోజుల్లో బీజేపీ(BJP) రాష్ట్ర నాయకత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుందని తెలిపారు. విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తూ వచ్చిందని విమర్శించారు. సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా ప్రకటన చేయడానికి భయమెందుకు? అని ప్రశ్నించారు. హైదారాబాద్(Hyderabad) సంస్థానం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు కలిపారు. ఆ రెండు రాష్ట్రాల్లో విమోచన దినోత్సవం వేడుకలు జరుపుతున్నారు. కాంగ్రెస్(Congress) అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా ఈ వేడుకలు జరుపుతున్నారని ఏలేటి గుర్తుచేశారు.

మరి తెలంగాణలో ఎందుకు నిర్వహించరు? అని అడిగారు. కేవలం ఎమ్ఐఎమ్(MIM) పార్టీకి భయపడే తెలంగాణలో విమోచన దినోత్సవం జరపడం లేదని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17 సమైక్య దినం కానే కాదు.. ముమ్మాటికీ విమోచన దినోత్సవమే అని అన్నారు. సెప్టెంబర్ 17పై కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. విమోచన కాకుండా విలీనం అంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టే అని అన్నారు. విలీన దినోత్సవం ఎలా అవుతుందో.. మేధావులు చెప్పాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా జరిపాలని కోరారు. ఎమ్మెల్సీగా అమీర్ అలీఖాన్‌(Amir Ali Khan)కు అవకాశం ఇచ్చారు. అసదుద్దీన్‌కు కోపం వస్తాదనే ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని చోట్ల కొత్త తెలంగాణ ఎంబ్లంతో పోస్టర్స్ పెట్టారు. అందులో కాకతీయ కలతోరణం లేదు. దీన్ని ఎప్పుడు అమలు చేశారో సీఎం వివరణ ఇవ్వాలని ఏలేటి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed