టీ- బీజేపీ ఆశలన్నీ ఆ సభపైనే.. బలం లేదన్న చోటనే గ్రాండ్ సక్సెస్ చేసేలా భారీ వ్యూహం..!

by Satheesh |
టీ- బీజేపీ ఆశలన్నీ ఆ సభపైనే.. బలం లేదన్న చోటనే గ్రాండ్ సక్సెస్ చేసేలా భారీ వ్యూహం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మంలో నిర్వహించనున్న సభపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్నది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఈ సభ టర్నింగ్ పాయింట్‌గా ఉంటుందని భావిస్తున్నది. ఖమ్మం జిల్లాలో కనీస స్థాయిలోనైనా కార్యకర్తలు లేరని, ప్రజల్లో ఆదరణ లేదని వస్తున్న విమర్శలను సవాలుగా తీసుకున్న బీజేపీ నాయకత్వం, అక్కడే లక్షమందితో సభ నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేయాలనుకుంటున్నది. ఈ సభతో మొదలుపెట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం కావాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. కర్ణాటక ఫలితాల తర్వాత పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని ఖమ్మంలో ఈ నెల 15న నిర్వహించనున్న బహిరంగ సభ పారదోలుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

కర్ణాటక రిజల్ట్స్ తర్వాత..

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో స్టేట్ చీఫ్ బండి సంజయ్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను కవర్ చేసిన తర్వాత పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. కాంగ్రెస్‌తో పోలిస్తే గ్రాఫ్‌లో ఎగువన ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ తర్వాత నిరుద్యోగుల తరఫున నిరసనలు, టీస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీతో ఆందోళనలు తదితర పోరాట రూపాలతో నేతలంతా జనం బాట పట్టారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం నేతలు వెళ్లిపోవడంతో తెలంగాణలో యాక్టివిటీ తగ్గిపోయింది. రిజల్టు తర్వాత పార్టీ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. బీజేపీ గ్రాఫ్ డౌన్ అయిందని, బీఆర్ఎస్‌కు దీటైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే మెసేజ్ జనంలోకి వెళ్లిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ పరిస్థితి ఇలానే ఉంటుందనే జనరల్ టాక్ వినిపిస్తున్నది.

అలర్ట్ అయిన హై కమాండ్

కర్ణాటక రిజల్ట్స్ తర్వాత పార్టీ పరిస్థితిపై శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నది. దీనికితోడు రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు తెరపైకి రావడం, రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం, మీడియాకు లీకులు.. ఇవన్నీ పార్టీకి ఇబ్బందికరంగా తయారయ్యాయి. అప్పటివరకూ బీజేపీలో వివిధ స్థాయిల్లోని నాయకులు ఇతర పార్టీల నుంచి చేరుతారనే ఊహాగానాలు వచ్చినా, కర్ణాటక ఫలితాల తర్వాత ఆ ప్రక్రియకు పూర్తిగా బ్రేక్ పడింది. పార్టీ పరిస్థితి స్తబ్దుగా మారడంతో సొంత పార్టీ నేతలే వేరే పార్టీల్లోకి వెళ్లిపోతారేమోననే చర్చలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన సెంట్రల్ హైకమాండ్.. కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులను తెలంగాణలో పర్యటించాల్సిందిగా ఆదేశించింది.

ఆ ప్రకారం పార్లమెంటు ప్రవాస్ యోజన పేరుతో కొద్దిమంది కేంద్రమంత్రులు వివిధ లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించారు. మోడీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జన సంపర్క్ అభియాన్ పేరుతో మరోసారి ప్రజలను కలిసే ప్రోగ్రామ్‌లను ఫిక్స్ చేశారు. అందులో భాగంగా ఖమ్మం టౌన్‌లో జరిగే సభకు అమిత్ షా హాజరవుతున్నారు. ఈ నెల 25న నాగర్‌కర్నూల్ టౌన్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. ఈ నెల చివర్లో ప్రధాని మోడీ కూడా ఒక సభకు హాజరయ్యేలా ముసాయిదా షెడ్యూలు తయారైంది. పీఎంఓ నుంచి స్పష్టత వచ్చిన తర్వాత మల్కాజిగిరి లేదా నల్లగొండ ప్రాంతాల్లో మోడీ సభ ఖరారయ్యే అవకాశముంది.

కేడర్‌లో జోష్ నింపేలా..

అసెంబ్లీ ఎన్నికల వరకూ వరుస బహిరంగసభలతో పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర, కేంద్ర నాయకత్వం భావిస్తున్నది. అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దే లక్ష్యంతో హైకమాండ్ ప్లాన్ చేస్తున్నది. ఖమ్మం సభ ద్వారా ఏకకాలంలో పార్టీశ్రేణులు, ప్రజల్లో జోష్ నింపడంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని అసంతృప్త నేతలను ఆకర్షించాలనుకుంటున్నది.

చాలా కాలంగా పార్టీలోకి చేరికలు ఆగిపోవడంతో మళ్లీ జోరు పెంచాలని భావిస్తున్నది. దీర్ఘకాలంగా ఏ యాక్టివిటీ లేకుండా సైలెంట్ ఉండిపోయిన పరిస్థితిని ఖమ్మం సభ నుంచే మార్చాలనుకుంటున్నది. ఖమ్మం సభ సక్సెస్ తర్వాత పొంగులేటి సహా పలువురు జిల్లా నేతలు పునరాలోచించి చేరుతారనే ఆశలూ రాష్ట్ర బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

ఖమ్మం సభ తర్వాత పార్టీలో ఊహించని డెవలప్‌మెంట్స్ జరుగుతాయని, ప్రజల్లోనూ పార్టీ పట్ల భరోసా ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని బీజేపీ స్టేట్ లీడర్స్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వరుస సభల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ అమిత్ షా, నడ్డా, ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశమున్నది.

Advertisement

Next Story

Most Viewed