అక్షింతలు పంచడం, అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ‌కి అభివృద్ధి పట్టదు: మంత్రి సీతక్క

by D.Reddy |
అక్షింతలు పంచడం, అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ‌కి అభివృద్ధి పట్టదు: మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క మండిపడ్డారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అక్షింతలు పంచడం, అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ‌కి అభివృద్ధి పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు మతాల మధ్య కొట్లాటలు పెట్టడమే తప్ప కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతూ, యువతకు ఉపాధి లేకుండా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

ప్రతి ఏడాది రెండు కోట్ల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని సీతక్క విమర్శించారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం 1200 చేసిందని, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే ప్రజలకు గ్యాస్ సిలిండర్ అందిస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.

అడవుల జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. అటవీ చట్టానికి సవరణలు చేస్తూ అడవి నుంచి అడవి బిడ్డలను పంపించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభయారణ్యం పేరుతో ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో అటవీ ప్రాణులకున్న విలువ మనుషులకు లేదని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.



Next Story