స్టేట్ ప్రెసిడెంట్ నియామకం.. బీజేఎల్పీ నేత ఏలేటి ‘కీ’ కామెంట్స్

by Rajesh |
స్టేట్ ప్రెసిడెంట్ నియామకం.. బీజేఎల్పీ నేత ఏలేటి ‘కీ’ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా హామీలు అమలుచేయడం లేదని, వారు చెప్పిన వంద రోజులు, ఆరు నెలల డెడ్ లైన్లు కూడా ముగుస్తూనే ఉన్నాయని, అయినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ప్రభుత్వం, ముఖ్యమంత్రికి మూడు రోజుల క్రితం లేఖ రాశానని అయినా పట్టించుకోలేదన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై సంతకం పెట్టారని, వృద్ధాప్య పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ సంతకం పెట్టారని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణలో ఆరు నెలలైనా పింఛన్లపై ఎలాంటి ఊసు లేదని మండిపడ్డారు. ఈ విషయంలో పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఏపీ రాష్టం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేరుస్తున్నారని ఏలేటి వివరించారు. చంద్రబాబు నాయుడు గతనెల పెన్షన్ కలిపి రూ.7 వేలు ఇస్తానన్నారని, ఇక్కడ రేవంత్ రెడ్డి ఆరు నెలల పెన్షన్ ను వృద్ధులకు ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు జీతాలు రావడం లేదని, వాస్తవానకి రేవంత్ వారి జీతాలు కూడా పెంచుతామన్నారని వివరించారు. ఇకపోతే ప్రభుత్వ పాఠశాలలో 1 తరగతి నుంచి 10 తరగతి వరకు పంపిణీ చేసే పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చి మళ్ళీ తీసుకున్నారని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై మరింత భారం పడుతుందన్నారు.

ఏపీలో గత ముఖ్యమంత్రి బొమ్మ ఉన్న పుస్తకాలు పిల్లలకు ఇచ్చారని, ఇక్కడ ఎందుకు రిటర్న్ తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, ఎవరిని నియమిస్తుందనేది కూడా వారే చూసుకుంటారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతిని చూశారని, అందుకే ప్రజలు తమవైపు ఉన్నారన్నారు. సర్కార్ పై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు, విచారణ సంస్థలు తేలుస్తాయని ఏలేటి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed