BIG Scam: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్ మాటున కండక్టర్లకు కాసుల వర్షం

by Shiva |   ( Updated:2024-08-06 11:46:05.0  )
BIG Scam: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్ మాటున కండక్టర్లకు కాసుల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సులు ఇంతకు ముందు కన్నా.. మరింత రద్దీతో రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. మహిళలకు ఉచిత ప్రయాణం కండక్టర్లకు మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కండక్టర్లు తెలివిగా పురుషులు తీసుకునే టికెట్‌ను కూడా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ టికెట్ ఇస్తూ.. డబ్బులు కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రయాణికులు ఇదేంటని ప్రశ్నిస్తే.. పొరపాటున ఇచ్చానంటూ ఆ టికెట్ చించి మరో టికెట్ ఇస్తున్నారు. ఎవరూ అడగకపోతే ఆ డబ్బులు వారి జేబుల్లోకే వెళ్తున్నాయి.

తాజాగా ఓ ప్రయాణికుడు జూన్ 26న కొత్తపేట్ నుంచి సరూర్‌నగర్‌ వరకు బస్సులో వెళ్లాడు. దీంతో అతడికి సదరు కండక్టర్ మహిళలకు ఇచ్చే ఫ్రీ టికెట్ ఇచ్చాడు. అదేవిధంగా మరో ప్రయాణికుడు జూలై 7న ఎల్బీ నగర్ నుంచి మన్నెగూడ వెళ్లగా అతడికి కూడా కండక్టర్ జీరో టికెట్ పంచ్ చేశాడు. ఇక ఆగస్టు 4న ఆదివారం మరో ప్రయాణికుడు సరూర్ నగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లగా అతడి నుంచి కండక్టర్ డబ్బులు తీసుకుని ఫ్రీ టికెట్ ఇచ్చినట్లుగా సదరు ప్రయాణికుడు వాపోయాడు.

ఈ క్రమంలోనే కండక్టర్లపై వస్తున్న ఆరోపణలను ఆర్టీసీ యూనియన్లు ఖండిస్తున్నాయి. ఎక్కడో ఒకచోట జరిగిన పొరపాటును జరిగితే ఆర్టీసీ మొత్తానికే అంటగట్టడం సరికాదని ఆరోపించాయి. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాక డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయాయి. మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు సిబ్బందిపై దాడులకు తెగబడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయని తెలిపాయి. కండక్టర్లు మహిళలకు మాత్రమే జీరో టికెట్ ఇస్తారని, పురుషులకు ఇస్తున్నారనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఖండించాయి. కండక్టర్లపై తప్పుడు ప్రచారం మానుకోవాలని, వారి మనోభావాలు దెబ్బతీయొద్దని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed