బుచ్చిబాబు ట్రోఫీ విజేత జట్టుకు 'భారీ' ప్రైజ్‌మనీ! హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు

by Geesa Chandu |   ( Updated:2024-09-13 19:51:06.0  )
బుచ్చిబాబు ట్రోఫీ విజేత జట్టుకు భారీ ప్రైజ్‌మనీ! హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావు భారీ నగదు బహుమతి ప్రకటించారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్‌ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ఛాంపియన్ గా అవతరించింది. గత రంజీ సీజన్‌లో ప్లేట్‌ డివిజన్‌లో అజేయ విజేతగా నిలిచిన హైదరాబాద్‌.. బుచ్చిబాబు టోర్నమెంట్‌లోనూ మేటి జట్లను చిత్తు చేసింది.

గత సీజన్‌ నుంచి ఇప్పటివరకు అజేయ రికార్డును కొనసాగించింది. దీంతో సీనియర్‌ మెన్స్‌ జట్టుకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్టు జగన్‌మోహన్‌ రావు తెలిపారు. బుచ్చిబాబు ట్రోఫీతో హైదరాబాద్‌కు చేరుకున్నకెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌, కోచ్‌ ఛటర్జీ, జట్టును శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. సుదీర్ఘ విరామం అనంతరం హైదరాబాద్‌ జట్టు బుచ్చిబాబు టోర్నమెంట్‌లో విజేతగా నిలవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గత సీజన్‌లో రంజీ ప్లేట్‌ ఛాంపియన్ గా నిలిచామన్నారు. ఈ సీజన్లో రంజీ ఎలైట్‌ ఛాంపియన్ గా నిలవాలనేది తన లక్ష్యమని పేర్కొన్నారు. క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి అవసరైన సహాయ సహకారాలు హెచ్‌సీఏ అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌ ఈ సీజన్లో గెలవటమే అలవాటుగా మార్చుకుందన్నారు. సొంతగడ్డకు బయట సాధించిన విజయం ఎప్పుడూ ప్రత్యేకమేనని ఆయన పేర్కొన్నారు. రానున్న రంజీ సీజన్‌ కోసం హైదరాబాద్‌ క్రికెటర్లు సిద్ధం కావాలని సూచించారు.

భారత మాజీ క్రికెటర్‌, పేస్‌ దిగ్గజం వెంకటేశ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రధానంగా బౌలర్లు ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టువదలని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిచ్‌ నుంచి సహకారం దక్కకపోయినా రెండు ఎండ్‌ల నుంచి బ్యాటర్లపై ఒత్తిడి పెంచటం ముఖ్యమన్నారు. హైదరాబాద్‌ బౌలర్లు సాధన చేయాలన్నారు. అనంతరం క్రికెటర్లు, సహాయక సిబ్బందితో అధ్యక్షుడు జగన్‌, కార్యదర్శి దేవరాజ్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రెటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్ రావు, హెచ్‌సీఏ సీనియర్‌ సభ్యుడు ఆగమ్‌ రావు, సీఈవో సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed