BIG News: విజయదశమి తరువాతే సర్పంచ్ ఎన్నికలు? ఆ లోపు ఓటర్ల తుది జాబితా ఫైనల్!

by Shiva |
BIG News: విజయదశమి తరువాతే సర్పంచ్ ఎన్నికలు? ఆ లోపు ఓటర్ల తుది జాబితా ఫైనల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దసరా పండుగ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి సుమారు పది రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈలోపు తుది ఓటరు జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్‌తో పంచాయతీ అధికారులు భేటీ అయి, పైనల్ ఓటరు జాబితా తయారు చేయడంపై షెడ్యూలు విడుదల చేశారు. అయితే, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల మేరకే ఎన్నికలు నిర్వహించడమా? లేకపోతే రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్లడమా?అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్రానికి అందిన ఓటరు లిస్టు

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓటరు జాబితా అందడంతోనే స్టేట్ ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లతో సమావేశమై వార్డులు, గ్రామాల వారీగా ఓటరు జాబితాను తయారుచేసి, పబ్లిష్ చేసేందుకు షెడ్యూలు విడుదల చేశారు. వచ్చే నెల 21న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఆ తర్వాతే రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను పెంచడమో లేకపోతే యథావిధిగా కొనసాగించడమో నిర్ణయించే అధికారం ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాక దసరా (అక్టోబరు 12) తర్వాత ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేస్తారనే టాక్ ఉంది. ఒకసారి షెడ్యూలు ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియ దాదాపు 10 రోజుల్లో పూర్తవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.

రెండు ప్లాన్లతో అధికారులు రెడీ

ఎన్నికల నిర్వహణపై ఆఫీసర్లు రెండు రకాల ప్లాన్లతో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. 1.ప్రస్తుత బీసీ రిజర్వేషన్ల మేరకు ఎన్నికలు నిర్వహించడం, అందుకు తుది ఓటరు లిస్టు ప్రకటించిన పక్షం రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం 2. రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్లడం, అందుకోసం ముందుగా కుల గణన చేయాలి. దానిని పూర్తి చేసేందుకు కనిష్టంగా 2 నుంచి 3 నెలల సమయం పడుతున్నది. ఒకవేళ కుల గణన చేసి, రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటే ఈ ఏడాది చివర లేదా కొత్త ఏడాది మొదట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు.

బీసీ రిజర్వేషన్ల పెంపు కష్టమే?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాని రిజర్వేషన్లు 50 % లోపు మాత్రమే ఉండాలని, ఒకవేళ పెంచితే కోర్టులు కొట్టేసే ప్రమాదం ఉందని న్యాయనిపుణులు చెపుతున్నారు. దీనితో బీసీ రిజర్వేషన్లను ఎలా పెంచాలి? ఒకవేళ పెంచకుండా ఎన్నికలకు వెళ్తే ఎలాంటి విమర్శలు వస్తాయి? అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం చట్టప్రకారం బీసీ రిజర్వేషన్లు 23 శాతంగా ఉన్నాయి. మిగతా 19 % రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇచ్చి, మొత్తం 42 % అమలు చేయొచ్చని కాంగ్రెస్ లీడర్లు భావిస్తున్నట్టు తెలిసింది.

ఆలస్యమైతే నిధులు కట్

సర్పంచులు, వార్డుమెంబర్ల పదవీకాలం ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జీపీలు కొనసాగుతున్నాయి. 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఇంతవరకు లోకల్ బాడీలకు కేంద్రం నుంచి గ్రాంట్స్ రాలేదు. ఇప్పుడు గ్రాంట్స్ కోసం కేంద్రం వద్దకు వెళ్తే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయనే ప్రశ్నలు ఉత్పన్నం కానున్నాయి. దాంతో ఎన్నికలు నిర్వహించిన తర్వాతే గ్రాంట్స్ కోసం డిమాండ్ చేయొచ్చని ప్రభుత్వం లెక్కలు వేస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed