BIG News: ముచ్చర్ల ‘ఫోర్త్ సిటీ’.. అదే ఇక ఫ్యూచర్ సిటీ..!

by Shiva |
BIG News: ముచ్చర్ల ‘ఫోర్త్ సిటీ’.. అదే ఇక ఫ్యూచర్ సిటీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం ఏకంగా 19 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన ముచ్చర్ల ఫార్మా సిటీ పీడ వీడనుంది. కాలుష్యం బారిన పడితే తమ గతి ఏం కావాలన్న లక్షలాది మందికి సమాధానం దొరికింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు స్థానంలో కొత్తవి రానున్నాయి. ఆ స్థానంలో కాలుష్యకారక నిర్ణయాలు రద్దయ్యాయి. అవే భూముల్లో ఆరోగ్యకరమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్.. ఇప్పుడు ముచ్చర్లను ఫోర్త్ సిటీగా రూపొందించాలని నిర్ణయించింది.

అదే మన ఫ్యూచర్ సిటీ అవుతోందని సీఎం రేవంత్‌‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లుగా తమ పొలాలు, ఊర్లు ఏం అవుతాయోనని భయపడిన మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల ప్రజలకు ఉపశమనం లభించింది. ఎల్బీనగర్‌లో 30 ఎకరాల్లో సిరిస్ కంపెనీ సృష్టించిన భయోత్పాతాన్ని సీఎం ప్రస్తావించారు. అలాంటిది ఇంత పెద్ద ఫార్మా సిటీతో ఉత్పన్నమయ్యే కాలుష్యానికి ఎంత మంది బలవుతారన్న ప్రశ్నకు సమాధానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను తెరమీదకు తీసుకొచ్చింది.

ఫార్మా రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, వైద్యం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటికి ప్రాధాన్యత కల్పించింది. ఫార్మా కంపెనీల స్థానంలో వీటిని ఏర్పాటు చేసేందుకు భూములను కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ఫార్మా సిటీ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలన్న కేటీఆర్ డిమాండ్‌కు దీటైన జవాబిచ్చారు. రైతులను రెచ్చగొట్టేందుకే ఈ ప్రస్తావన చేస్తున్నారని, ఈ క్రమంలోనే అక్కడి భూముల్లో ప్రభుత్వం ఏమేం చేయబోతున్నదో వివరించారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలకు వ్యూహరచన చేశారు.

మారనున్న రూపురేఖలు

ముచ్చర్లలో ఫార్మా సిటీ ప్రాజెక్టు చెంత నివాస ప్రాంతాలు అంటే అందరూ భయపడ్డారు. కళ్ల ముందే అనేక ఫార్మా కంపెనీలు ఉన్న చోట ఎలాంటి కాలుష్యం వెదజల్లుతున్నాయో చూశారు. దాని స్థానంలో హెల్దీ ప్రాజెక్టుల రూపకల్పనతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని కొంత ఏరియా రూపురేఖలే మారిపోనున్నాయి. ఏఐ, హెల్త్ టూరిజం, స్కిల్ యూనివర్సిటీలు, స్టేడియంలతో కందుకూరు, మహేశ్వరం, కడ్తాల, ఆమనగల్లు, యాచారం, ఇబ్రాహీంపట్నం మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తాయని అంచనా. ఇక్కడీ ఫోర్త్ సిటీ నిర్మాణం రూపుదాలిస్తే మరిన్ని లేఅవుట్లు, టౌన్‌షిప్స్, గేటెడ్‌ కమ్యూనిటీలు ఏర్పాటు కానున్నాయి.

ఔటర్‌ రింగ్‌ రింగ్‌‌రోడ్డుకు, రీజినల్‌ రింగ్‌‌రోడ్డుకు మధ్యన ఉండే ఈ ప్రాంతం మీద ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వేలాది ఎకరాలు కొని డెవలప్‌మెంట్‌కు సిద్ధంగా ఉంచుకున్నాయి. రోడ్డు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. శ్రీశైలం, నాగార్జున‌సాగర్‌ హైవేలకు అనుసంధానంగా కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని గ్రామాలకు కూడా నాలుగు లైన్ల రోడ్లు వస్తాయి. కందుకూరు-యాచారం, కడ్తాల-శేరిరెడ్డిగూడెం- కుర్మిద్దె రోడ్డు, మీర్‌ఖాన్‌పేట- తాటిపర్తి- కుర్మిద్దె, వనపర్తి- చెరికొండ- మేడిపల్లి, మైసిగండి- ఎక్కువపల్లి, కుర్కల్‌పహడ్‌- ఎక్కువపల్లి, రామనుంతల- కోనాపూర్‌-మర్రిపల్లి- ఎక్కువపల్లి రోడ్లకు మహర్దశ పట్టనుంది.

హైదరాబాద్‌ ఫార్మా సిటీ

మొత్తం విస్తీర్ణం: 19,333 ఎకరాలు(78.24 చ.కి.మీ)

ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.16,395 కోట్లు

భూ సేకరణకు ఖర్చు: సుమారు రూ.2 వేల కోట్లు

ఉపాధి అవకాశాలు: 4.25 లక్షలు (ప్రత్యక్ష ఉపాధి 1.70 లక్షలు)

మండలాలు: కందుకూరు, యాచారం, కడ్తాల

బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిపాదన

అంశం విస్తీర్ణం

ఫార్మా నిమ్జ్‌(ఫార్మా ఉత్పత్తులు) 13,030 ఎకరాలు

ఫార్మా సిటీ టౌన్‌షిప్స్ 1,593 ఎకరాలు

ఫార్మా యూనివర్సిటీ 630 ఎకరాలు

ఫార్మా ఆర్‌ అండ్‌ డీ 4,080 ఎకరాలు

ఫార్మా సిటీ భూమి 19,333 ఎకరాలు

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదన

ముచ్చర్ల ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫార్మా కంపెనీలకు బదులుగా రిలేటెడ్ సంస్థలను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. ఉత్పత్తి కంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వరకే పరిమితం చేయనున్నది. అలాగే స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేసి వివిధ రంగాల్లో నిరుద్యోగ యువతను నైపుణ్యాభివృద్ధి దిశగా తీర్చిదిద్దడానికి కార్యాచరణను రూపొందించింది. ఈ మేరకు గురువారం వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు స్పోర్ట్స్ స్టేడియంలు, గోల్ఫ్ క్లబ్స్, క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందుకోసం 200 ఎకరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి, హెల్త్ టూరిజానికి 1,000 ఎకరాలు, స్కిల్ వర్సిటీకి 200 ఎకరాలు, గోల్ఫ్ క్లబ్‌కు 200 ఎకరాల వంతున కేటాయిస్తున్నది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(ఎన్ఏసీ)ని విస్తరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

కాలుష్యంతో ముప్పు

బీఆర్ఎస్ ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మా సిటీ ప్రతిపాదనతోనే అరబిందో ఫార్మా లిమిటెడ్‌ 250 ఎకరాలు, బాలాజీ అమైన్స్‌ లిమిటెడ్‌ 100 ఎకరాలు, డా.రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ లిమిటెడ్‌ 200 ఎకరాలు, గ్లాండ్‌ కెమికల్స్‌ ప్రైవేటు లిమిడెట్‌ 100 ఎకరాలు, గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌ 100 ఎకరాలు, గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌ 100 ఎకరాలు, హెటిరో గ్రూప్‌ 250 ఎకరాలు, ఎంఎస్‌ఎన్‌ ల్యాబరేటరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 250 ఎకరాలు, ఎంఎస్‌ఎన్‌ ఫార్మాకెమ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 150 ఎకరాలు, మైలాన్‌ ల్యాబరేటరీస్‌ లిమిటెడ్‌ 100 ఎకరాలు, శ్రీని ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ 100 ఎకరాలు, విర్కో ల్యాబరేటరీస్‌ లిమిటెడ్‌ 200 ఎకరాలకు ఎసరు పెట్టాయి. ఇలాంటి ఫార్మా కంపెనీలు రావడం ద్వారా ఈ ప్రాంతమంతా కాలుష్యంతో నిండిపోతుందని, జనం రోగాల బారిన పడతారని ఆందోళన చేశారు. పలువురు పర్యావరణవేత్తలు కూడా గొంతెత్తి నినదించారు. సిటీకి దగ్గరలో ఫార్మా కంపెనీల స్థాపనతో లక్షలాది మంది ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. అయినా బీఆర్ఎస్ పెద్దలు ఇవన్నీ కాలుష్యమే వెదజల్లవని, ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పెడతారంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Advertisement

Next Story

Most Viewed