రాజకీయాల్లో పెనుమార్పు.. ఈ సారి BCల మద్దతు ఎవరికంటే..?

by Disha Web Desk 4 |
రాజకీయాల్లో పెనుమార్పు.. ఈ సారి BCల మద్దతు ఎవరికంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి లోక్‌సభకు బీసీ నినాదం ఊపందుకుంది. పార్టీ ఏదైనా బీసీ అభ్యర్థికి ఓటువేయాలనే చర్చమొదలైంది. నలుగురు బీసీలు కలిసినా, శుభ, అశుభకార్యం ఏదైనా బీసీకి ఓటువేయాలని, సత్తాచాటాలని భావిస్తున్నారు. మూడు పార్టీలు కలిపి 14 మందికి టికెట్లు ఇవ్వడం తొలిసారి. ఇందులో బీఆర్ఎస్ పార్టీ 6 గురికి టికెట్లు ఇవ్వగా, బీజేపీ-5 గురికి, కాంగ్రెస్ -3 గురికి టికెట్లు ఇచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో పార్టీలో ఇద్దరు బీసీలకు కేటాయించినా వారికి మద్దతుగా నిలవాలని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ‘బీసీల ఓట్లు... బీసీలకే’ అనే నినాదంతో ముందుకు సాగబోతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

రాజకీయంగా వెనుకబాటు

రాష్ట్రంలో జనాభాలో 54 శాతం మంది బీసీలు ఉన్నట్లు సమగ్ర సర్వే పేర్కొంటుంది. అయితే రాజకీయంగా మాత్రం వెనుకబాటుకు గురవుతున్నారు. పార్టీలు రాజకీయప్రాతినిధ్యం కల్పించడంలేదని బీసీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఏ ఎన్నికలు వచ్చినా బీసీలకు తక్కువ సీట్లే కేటాయిస్తున్నాయి. దీంతో కొంత నారాజ్‌గా ఉన్నారు. అయితే ఈసారి ఐకమత్యం చాటేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాని బీసీ చర్చ లోక్‌సభ ఎన్నికల్లో మొదలైంది. ఏ పార్లమెంటు సెగ్మెంట్‌లో బీసీ పోటీ చేస్తున్నారో వారికి మద్దతుగా నిలువాలని భావిస్తున్నారు. అందుకోసం కసరత్తును ప్రారంభించారు. కమ్యూనిటీల వారీగా సమావేశాలు నిర్వహించి బీసీకే మద్దతు అంటూ ఏకగ్రీవ తీర్మానం చేస్తుండటం గమనార్హం. అంతేకాదు ఎక్కడ బీసీ అభ్యర్థి పోటీ చేస్తున్నా వారికే ఓటువేయాలని ఫోన్ మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

బీసీల్లో చైతన్యం కోసం పోరాటాలు

బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్.కృష్ణయ్య పోరాటం కొనసాగించగా, బీసీల పక్షాన ఈటల రాజేందర్ సైతం నిలిచారు. అదే విధంగా బీసీ హక్కుల సాధన కోసం, వారిని ఏకతాటిని తీసుకొచ్చేందుకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోరాటం చేశారు. 93 కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన నేతగా గుర్తింపు పొందారు. 20 ఏళ్ల క్రితం బీసీల ఐక్యతకోసం, సమస్యలపై ఉద్యమించారు. ఆ కులాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా కాసాని కొనసాగుతున్నారు. అంతేకాదు ఆయన బీసీ హక్కులపై పోరాటం చేసేందుకు, సబ్బండ వర్గాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు సమస్యలపై పోరాటానికి 2007లో ఏకంగా ‘మనపార్టీ’ని స్థాపించి హక్కులపై ఉద్యమించారు. అయితే ప్రస్తుతం బీసీల్లో వస్తున్న చైతన్యం కాసాని ఉద్యమ ఫలితంగానే అని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ముదిరాజ్ సమస్యలతో పాటు బీసీల సమస్యలపైనా నీలం మధు ముదిరాజ్ నినదిస్తున్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, బూర నర్సయ్యగౌడ్ సైతం బీసీల హక్కులు, ఉద్యోగుల హక్కుల సాధనతో పాటు బలహీన వర్గాల సమస్యలపైనా నిరంతరం గళం వినిపిస్తున్నారు.

పోరాటానికి సిద్ధమవుతున్న యువ నేతలు

బీసీ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రస్తావించేందుకు, పోరాడేందుకు యువ నేతలు సైతం సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే దూదిమెట్ల బాలరాజుయాదవ్, కాసాని వీరేశ్ ముదిరాజ్, పల్లె రవికుమార్ గౌడ్, రామారావు ఇలా పలువురు బీసీ నినాదంతో ముందుకు సాగుతున్నారు. చేవేళ్ల, భువనగిరి, కరీంనగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి గెలుపునకు యువత అంతా కృషి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక గ్రూపులు సైతం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తున్నట్లు సమాచారం. బీసీ అభ్యర్థుల గెలుపును భుజన వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ గతానికి భిన్నంగా లోక్ సభ ఎన్నికల సమయంలో బీసీ నినాదం ఊపందుకోవడం శుభ పరిణామమని పలువురు బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Next Story