నేటి నుంచి భట్టి పాదయాత్ర.. వాటిపైనే మెయిన్ ఫోకస్!

by Sathputhe Rajesh |
నేటి నుంచి భట్టి పాదయాత్ర..  వాటిపైనే మెయిన్ ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికారంలోకి వచ్చేందుకు 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర తరహాలో ప్రస్తుతం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో గురువారం సాయంత్రం 4.00 గంటలకు మొదలయ్యే హాథ్ సే హాథ్ జోడో యాత్ర అభియాన్‌లో భాగంగా భట్టి విక్రమార్క పాదయాత్రను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే ప్రారంభించనున్నారు.

దీనికి ఏఐసీసీ కార్యదర్శి నదీమమ్ జావెద్, రోహిత్ చౌదరి, పలువురు సీనియర్ నాయకులు సైతం హాజరు కానున్నారు. మొత్తం 41 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా 91 రోజుల పాటు దాదాపు 1,365 కి.మీ మేర యాత్ర జరిగేలా ఏఐసీసీ రూట్‌మ్యాప్ తయారు చేసింది. మండు వేసవిలో బొగ్గుబావుల ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగనున్నది.

ఇది వ్యక్తిగతంగా చేస్తున్న యాత్ర కాదని, ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ చేపట్టే యాత్రేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వివిధ సెక్షన్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ.వేలాది కోట్లు ఖర్చు చేసినా వాటి ఫలాలు ప్రజలకు అందకపోవడం, అధికార పార్టీకి చెందిన నేతల అక్రమాలు, భూకబ్జాలు, సర్కారు విధానాలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇలా అనేక సమస్యలను పాదయాత్రలో ప్రస్తావించి ప్రజల్లో బహిర్గతం చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయనున్న కార్యక్రమాలపైనా స్పష్టమైన హామీ ఇస్తామని తెలిపారు. వారానికి ఒక రోజు పాదయాత్రకు విరామం ఉంటుందన్నారు.

జూన్ 15న ఖమ్మంలో ముగింపు

పాదయాత్ర జూన్ 15న ఖమ్మంలో ముగియనున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదలయ్యే యాత్ర వచ్చే నెల 3 వరకూ ఆ జిల్లా పరిధిలో కొనసాగనున్నది. ఏప్రిల్ 2న జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు ఆధ్వర్యంలో లక్ష మందితో మంచిర్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో రాజస్థాన్ సీఎం గెహ్లాట్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ముగింపు సభకు కూడా లక్షలాది మంది వస్తారని భట్టి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story