పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : తెల్లం వెంకట్రావు

by M.Rajitha |
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : తెల్లం వెంకట్రావు
X

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయించిన నేతలపై వేటు వేయాల్సిందే అంటూ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ తో ఎన్నికల్లో గెలిచి, తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియా శ్రీహరీలను అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్ట్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను నాలుగు వారాల్లోగా అనర్హులుగా ప్రకటించాలని లేదంటే తామే సుమోటోగా తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందించారు. తాను తన నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానని, నియోజకవర్గ అభివృద్ది కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. తమపై వచ్చిన తీర్పును బీఆర్ఎస్ నాయకులు ఏదో గొప్పగా అనుకుంటున్నారని, అసలు ఫిరాయింపులపై మాట్లాడే అర్హతనే ఆ పార్టీకి లేదంటూ మండి పడ్డారు. గత పదేళ్ళలో అన్ని పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకొని, ఇపుడు మాత్రం ఫిరాయింపులు అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని.. దీనిపై ఏం చేయాలి అనేది ఆలోచిస్తామని వెంకట్రావు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed