నడిగడ్డలో బీఆర్ఎస్‌కు BIG ఝలక్.. సీఎం రేవంత్ రెడ్డితో తిమ్మప్ప భేటీ

by GSrikanth |
నడిగడ్డలో బీఆర్ఎస్‌కు BIG ఝలక్.. సీఎం రేవంత్ రెడ్డితో తిమ్మప్ప భేటీ
X

దిశ, గద్వాల: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్‌ఎస్‌కు జలక్ ఇచ్చేందుకు ఆ పార్టీ సీనియర్ నేత, కన్జ్యూమర్ కస్టమర్ ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా నడిగడ్డలో చర్చనీయాంశం అయ్యింది. జోగులాంబ గద్వాల జిల్లాలో బలమైన వాల్మీకి (బీసీ )నేతగా ఉన్న గట్టు తిమ్మప్ప బీఆర్ఎస్‌లో కొనసాగుతూ వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు కన్జ్యూమర్ కస్టమర్ ఫోరం చైర్మన్‌గా పనిచేశారు. ఎన్నికల సమయానికి ముందే ఆయన పార్టీ మారుతారు అని ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు రెండవసారి కన్జ్యూమర్ కస్టమర్ ఫోరం చైర్మన్‌గా అవకాశం కల్పించింది.

గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో బోయ సామాజిక వర్గం పెద్ద మొత్తంలో ఉండడంతో ఆ వర్గం మెజారిటీ ఓట్లు బీఆర్‌ఎస్‌కు వేయించి.. అభ్యర్థులను గెలిపించడంలో తన వంతు పాత్రను పోషించాడు. స్థానిక నేతలతో సఖ్యత లేకపోవడం, ఇతర కారణాల వలననో పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. గతంలో ఉన్న పరిచయాల కారణంగానే మర్యాదపూర్వకంగా కలిశామని చెబుతున్నప్పటికీ ఆయన పార్టీ మారిందుకే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వాల్మీకుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వివరించడంతోపాటు, స్థానిక రాజకీయ పరిస్థితులపై తిమ్మప్ప ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం.

ఈ విషయమై ‘దిశ’ వివరణ కోరగా ముఖ్యమంత్రిని కలిసిన మాట వాస్తవమే.. నాకు రెండుసార్లు బీఆర్ఎస్ కన్జ్యూమర్ కస్టమర్ ఫోరం చైర్మన్‌గా బాధ్యతలను అప్పగించిందే తప్ప.. ఒక కార్యాలయము లేదు.. కనీసం ఒక కుర్చీని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. గౌరవ వేతనం అసలే ఇవ్వలేదు. దీనికి తోడు గద్వాలలో కుటుంబ పాలన సాగుతోంది. బీసీ బిడ్డను కాదని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడంలో మా వంతు పాత్ర పోషించాం. కానీ మా వాల్మీకులకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. త్వరలోనే మా అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరుతామని తిమ్మప్ప వెల్లడించారు. ఎంపీ, స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిమ్మప్ప పార్టీ మారేందుకు నిర్ణయించుకోవడం వల్ల బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ తగలడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed