Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

by Ramesh N |
Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరం ను ఫోర్త్ సిటీగా మారుస్తామనే సర్కార్ ప్రకటన వెనుక పెద్ద భూదందా నడుస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే అగ్గువకు కొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదని, పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూ దందాను తెరపైకి తేవడమే కాకుండా మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారని ఆరోపించారు.

భూమాతను భూమేతకు..

ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. భూమాతను భూమేతకు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరిగిందని, తెలంగాణ ఏర్ప‌డిన నాటికి రాష్ట్రంలో 24 ల‌క్ష‌ల అసైన్డు భూములుంటే నేడు ఆ భూములు ఐదు ల‌క్ష‌ల‌కు ఎలా త‌గ్గాయన్నారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ లీడ‌ర్లు భుములు దండుకున్నారని, రిజిస్ట్రేష‌న్లు చేయించుకున్న వివ‌రాలేవి? వాటిని ఎందుక‌ని రేవంత్ స‌ర్కారు బ‌య‌ట పెట్ట‌డం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు స‌భ్యుల‌తో వేసిన క‌మిటీ నివేదిక ఏది? ధరణి పేరుతో దోపిడీ చేసిన దోషులెవ‌రో ఎందుకు తేల్చడం లేదు? ధరణిపై వేసిన కమిటీ బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ నేతలు ఏ విధంగా దోచుకోవాలా? అనే అంశంపై రహస్య నివేదిక ఇచ్చినట్లు ఉందన్నారు. అందుకే ఫోర్త్ సిటీ, భూమాత పేరుతో భూములను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రుణమాఫీ 18 లక్షల మంది రైతులకు మాత్రమే

ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని మండిపడ్డారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ హయాంలోనే 36 లక్షల మంది ఉంటే.. లక్షన్నర లోపు రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 18 లక్షలు దాటకపోవడం విడ్డూరమన్నారు. రుణమాఫీ సహా 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోందని, ఈ మేరకు కార్యాచరణ రెడీ అవుతోందని బండి స్పష్టంచేశారు.

Advertisement

Next Story