పోలీసులకు చుక్కెదురు.. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ తిరస్కరణ

by Mahesh |   ( Updated:2023-04-18 11:05:01.0  )
పోలీసులకు చుక్కెదురు.. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ తిరస్కరణ
X

దిశ, వరంగల్ బ్యూరో: హన్మకొండ జిల్లాలోని కమలాపూర్‌లో పదో తరగతి పేపర్ లీక్ కేసులో పోలీసులకు చుక్కెదురు అయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను 4వ మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు రిటర్న్ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న ప్రొవిజన్లతో మెజిస్ట్రేట్ విబేధించింది. దీంతో దీనిపై హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించనున్నట్లు సమాచారం. టెన్త్ హిందీ ప్రశ్నాపత్రాన్ని వాట్సప్‌లో లీక్ చేసిన కేసులో బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. ఇటీవల బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదని, బెయిల్ రద్దు చేయాలని పిటీషన్‌లో కోరారు. మంగళవారం పిటిషన్‌ను రిటర్న్ చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. హనుమకొండ ఫోర్త్ ఎంఎం కోర్టులో పీపీ సత్యనారాయణ పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ పీపీ వాదనలు వినిపించారు. ఇప్పటికే బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను హనుమకొండ జిల్లా కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఏ6, ఏ9 బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. అయితే పరీక్ష ప్రారంభమైన తర్వాత హిందీ పేపర్‌ను వాట్సప్‌లో వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు. ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో రాజకీయం దుమారం చెలరేగింది.

Advertisement

Next Story

Most Viewed