బ్రోకర్.. లిక్కర్.. లీకర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్

by Javid Pasha |
బ్రోకర్.. లిక్కర్.. లీకర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కల్వకుంట్ల కుటుంబానికి ప్రతీది సాధ్యమేనని, ఒకరు పాస్ పోర్టుల బ్రోకర్ అయితే, ఒకరు లిక్కర్ స్కామ్ లో ఉన్నారని, మరొకరు పేపర్ లీకర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్నా చౌక్ వద్ద శనివారం నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నా ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైందని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగులు భయపడొద్దని, బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు ఇంకెన్నాళ్లు మౌనంగా ఉంటారని, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కేసులు పెడతారని భయపడొద్దని, నిరుద్యోగుల తరపున కొట్లాడి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దామని బండి పిలుపునిచ్చారు. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన బీజేవైఎం నాయకులను జైళ్లో వేశారని, అక్కడ వారికి అన్నం పెట్టకుండా వేధిస్తున్నారని, ఇతర ఖైదీలతో బూతులు తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తారా? అని జైళ్ల శాఖ డీజీపై ఫైరయ్యారు. భవిష్యత్ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, జైళ్ల శాఖ డీజీకి చిప్పకూడు తినిపిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీతో నిరుద్యోగులు చస్తుంటే కనీసం పట్టించుకోని సీఎం కేసీఆర్.. రాహుల్ గాంధీ కోసం బ్లాక్ డే పాటిండచంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సబ్బండ వర్గాలు ఏకమై తెచ్చిన తెలంగాణలో రాళ్లు మోసినోళ్లు దొంగలయ్యారని, రాళ్లు విసిరినోళ్లు రాజులయ్యారని పేర్కొన్నారు. లీకేజీ అంశంపై ప్రశ్నిస్తే తమకు నోటీసులు ఇచ్చారని, మరి మంత్రి కేటీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని బండి ప్రశ్నించారు. ఇద్దరికే లీకేజీ సంబంధం ఉందని చెప్పి ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారన్నారు. లీకేజీలో కేసీఆర్ కొడుకు పాత్ర ఉందని, ఆయనకూ నోటీసులివ్వాల్సిందేనన్నారు.

టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగిస్తే వారు బయటకొచ్చి వాస్తవాలు బయటపెడతారనే భయంతోనే వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ కొడుకు రాజీనామా చేసేంత వరకు పోరాడుదామని బండి పిలుపునిచ్చారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాడుతానని స్పష్టంచేశారు. టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ అన్ని జిల్లాల్లో తిరుగుతోందని ఆయన స్పష్టంచేశారు. నిరుద్యోగుల సమస్యలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ చేపడుతామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed