సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలుగా కార్పొరేట్ కాలేజీలు: బండి సంజయ్ ఫైర్

by Satheesh |
సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలుగా కార్పొరేట్ కాలేజీలు: బండి సంజయ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల అరాచకాలు హద్దు మీరాయని, కేసీఆర్ అండ చూసుకుని రెచ్చిపోతున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. చైతన్య కళాశాలతో పాటు అనేక కార్పొరేట్ కాలేజీలు కేసీఆర్‌కు కమిషన్లు ముట్టచెప్తున్నాయని, అవి ఆయనకు ఏటీఎంలా మారాయని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఇక మిగిలింది ఆరు నెలలేనని, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని, చైతన్య కళాశాల సంగతి చూస్తామని హెచ్చరించారు.

అధికారంలోకి రావడంతోనే పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామన్నారు. చైతన్య కళాశాలలో ఇటీవల ఒక విద్యార్థిని అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణకు డిమాండ్ చేసిన బీజేవైఎం కార్యకర్తలపై యాజమాన్యం దాడి చేసిందని గుర్తుచేశారు. ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పవన్‌ను బుధవారం పరామర్శించిన అనంతరం పై వ్యాఖ్యలు చేశారు.

కార్పొరేట్ కాలేజీలను నియంత్రించేదాకా బీజేపీ పోరాటం ఆగబోదని అన్నారు. బీజేవైఎం నాయకులు ఆందోళన చేస్తుంటే కళాశాల యాజమాన్యం దుర్మార్గంగా పోలీసులతో కొట్టించి విచక్షణారహితంగా దాడులు చేయించిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అండతోనే కార్పొరేట్ కాలేజీలు రెచ్చిపోతున్నాయని, విద్యార్థులను వేధించి ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు.

విద్యార్థిని అనుమానాస్పద న్యాయ విచారణ జరపడానికి కాలేజీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. చైతన్య కాలేజీ కారణంగా అనేక చిన్న ప్రైవేటు కాలేజీలు మూతపడ్డాయన్నారు. బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను దాడులతో భయపెట్టి ఆపలేరని హెచ్చరించారు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎంతకైనా తెగిస్తామన్నారు. కేసీఆర్ కార్పొరేట్ కాలేజీలను నియంత్రించేదాకా పోరాటం ఆగదన్నారు.

కొండగట్టులో కేసీఆర్ ఫ్యామిలీ భూ దందా

హస్తినాపురంలో బుధవారం రాత్రి జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ, కొండగట్టులో కేసీఆర్ కుటుంబం భూదందాకు పాల్పడుతున్నదని, యాదాద్రి ఆలయం అభివృద్ధి పేరుతో అక్కడ చేసిన దోపిడీ రుచిమరిగి ఇప్పుడు ఇక్కడ వాలిందని ఆరోపించారు. కేసీఆర్‌కు ఆలయాల మీద ప్రేమ లేదని, దాని చుట్టూ ఉన్న భూములపైనే ధ్యాస అని అన్నారు.

కేసీఆర్ కుటుంబం కొండగట్టు చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొన్నదని, ఇటీవల కేసీఆర్ బిడ్డ కొండగట్టు టూర్ వెనుక భూముల కొనుగోలు కుట్ర ఉన్నదన్నారు. ఆ తరువాతే కొండగట్టును అభివృద్ధి రాగాన్ని అందుకున్నారని గుర్తుచేశారు. వెయ్యి కోట్లయినా ఇస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, గతంలో యాదాద్రిలోనూ ఇదే తరహాలో భూ దందా చేశారని ఆరోపించారు.

వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. 500 కోట్లు, ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తానన్న గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటివరకూ నిధుల్ని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీచర్లను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మచ్చిక చేసుకోడానికి ఎత్తుగడ వేశారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జీవో 118 అమలు చేస్తానని ఓట్లు దండుకుని మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని కామెంట్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే నిలువ నీడలేని పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

డబుల్ బెడ్‌రమూమ్ ఇండ్ల ఆశ చూపి లక్షలాది మంది ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ సర్కార్ తీరును ఎండగట్టేందుకే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మోసాలను యువతకు తెలియజేసేందుకే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లు కట్టించిందని, రాష్ట్రంలో 2.40 లక్షల ఇండ్ల నిర్మాణానికి నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించారని ఆరోపించారు.

ఆ ఇండ్లను నిర్మిస్తే మరో 5 లక్షల ఇండ్లను కేంద్రం నుండి మంజూరు చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పినా పేదలకు ఇల్లు ఇవ్వలేదన్నారు. కరెంట్, ఆర్టీసీ ఛార్జీలతోపాటు ఆస్తి పన్నులు, నీటి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నరని అన్నారు. మళ్లీ కరెంట్ ఛార్జీలను పెంచడానికి రెడీ అవుతున్నారని గుర్తుచేశారు.

పీఆర్సీ అమలు చేయకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే కాక ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదన్నారు. యువతకు ఉద్యోగాలివ్వని కేసీఆర్ తన కుటుంబానికి మాత్రం ఉద్యోగాలిచ్చుకున్నరని అన్నారు. టీచర్లకు ప్రమోషన్లు, స్పౌజ్ బదిలీలు లేవన్నారు. డీఎస్సీ వేయకపోవడంతో 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. జీవో 317తో టీచర్లను, జీవిత భాగస్వాములను, కుటుంబ సభ్యులను చెట్టుకొకరు పుట్టకొకరిని చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన టీచర్లపై దాడులు చేయించి అరెస్టు చేసి జైలుకు పంపారని గతేడాది ఆయనను అరెస్టు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ కారణంగా ఇప్పటికి 15 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ ఇండ్లు కట్టిస్తానంటూ హామీ ఇచ్చి మాట తప్పారని, సొంత జాగ ఉన్న కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇస్తానని తొలుత ప్రకటించి ఆ తర్వాత రూ. 3 లక్షలకు తగ్గించారని, దాన్ని కూడా నిలుపుకోలేదని గుర్తుచేశారు. స్కూళ్లకు, ఆసుపత్రులకు కనీస సౌకర్యాలు కల్పిస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్ టాయిలెట్లు లేక, చాక్‌పీసులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed