Viral Video : బండి సంజయ్ అలా అనలేదు..! వైరల్ వీడియోపై స్పందించిన బీజేపీ

by Ramesh N |
Viral Video : బండి సంజయ్ అలా అనలేదు..! వైరల్ వీడియోపై స్పందించిన బీజేపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అభ్యర్థులతో కలిసి ఆయన సచివాలయానికి ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులు బండిసంజయ్‌ను కారులోకి ఎక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నన్ను లోపలికి గుంజు.. లోపలికి గుంజు’ అంటూ బండి సంజయ్ పోలీసులకు చెప్పడంతో ఆయనను కారులోకి బలవంతంగా పోలీసులు కూర్చోబెట్టారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఆదివారం ఎక్స్ వేదికగా తెలంగాణ బీజేపీ స్పష్టం చేసింది. ఏసీ రూమ్‌లో నుండి బయటకు రారు.. వచ్చి కొట్లాడే కోళ్లను చూసి సహించరని విమర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూప్స్ అభ్యర్థులు చేస్తున్న న్యాయ పోరాటాన్ని నీరుగార్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభం చేకూరేలా బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. బండి సంజయ్ పోలీసులకు తనను గుంజకు అని చెప్తే, కారులోకి గుంజమని ఆయనే చెప్పారని బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నదని ఆరోపించింది.

ఈ టీబీజేపీ పోస్ట్‌పై బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ కౌంటర్ ఇచ్చింది. మీ రహస్య స్నేహితుడు కాంగ్రెస్‌ను రక్షించడానికి రంగంలోకి దిగి అశోక్‌నగర్‌లో ఆడిన మీ దొంగ నాటకాలను లైవ్‌లో కెమెరాల సాక్షిగా దేశమంతా చూసిందని, ఇంకా ఎందుకీ కవరింగ్ పోస్టులు? అని ప్రశ్నించింది. ఎప్పుడూ ఏదో ఒక డ్రామా చేసి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసుడు మీ పార్టీ పేటెంటు అని విమర్శించింది. మా పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి.. తెలంగాణలో ఎవరికి ఏ ఆపద వచ్చినా.. గుర్తొచ్చేది తెలంగాణ భవన్ అని పేర్కొంది. ఇంకో వందేళ్లు గడిచినా.. మీలాంటి జాతీయ పార్టీలకు తెలంగాణ అర్థంకాదని ఫైర్ అయింది. ఇలాంటి చిల్లర పోస్టులు పెడుతూ మీకున్న ఆ కొంచెం ఇజ్జత్ కూడా ఎందుకు తీసుకుంటారని కౌంటర్ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed