సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదు: బండి సంజయ్

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-27 09:07:08.0  )
సింగరేణి ప్రైవేటీకరణ సాధ్యం కాదు: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో అబద్దం... రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, తన జిత్తుల మారి ఎత్తులతో రైతులను, విద్యార్థులను, కార్మికులను మోసం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులను నట్టేట ముంచిన కేసీఆర్ తాను చేసిన తప్పిదాలను కేంద్రంపై మోపి బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరపించారు. తెలంగాణలో కొంగు బంగారం.... నల్లబంగారానికి నెలవైన సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందంటూ విష ప్రచారానికి తెరదీస్తూ సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతూ లేకుండా పోయిందని, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా సిగ్గులేకుండా పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని చెప్పారు. అందుకే సింగరేణిని ప్రైవేటీకరించాలనే ప్రచారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశానని, తన లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సింగరేణి విషయంలో స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు.

సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని కేంద్రమంత్రి తేల్చారని తెలిపారు. సింగరేణి సంస్థలో అత్యధికంగా 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్ర వాటా 49 శాతం మాత్రమేనన్నారు. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం అసాధ్యమన్నారు. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ఈ వాస్తవాలను అర్ధం చేసుకోవాలని, ఇకనైనా కళ్లు తెరుచుకుని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు.

Advertisement

Next Story