- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Bandi Sanjay : వరి వద్దంటే.. కాంగ్రెస్ కూడ వద్దు : బండి సంజయ్

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో వరి(Paddy) పంట వేయొద్దని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) ప్రచారంలో భాగంగా వరంగల్ వచ్చిన బండి సంజయ్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ఉపాధ్యాయ ఓటర్లతో సమావేశమయ్యారు. వర్షాలు పుష్కలంగా పడి నదుల్లో నీళ్లున్నా... కాంగ్రెస్ చేతగానితనంవల్ల ఆ నీళ్లు వాడుకోలేకపోయారని మండిపడ్డారు. క్రిష్ణా నీటి(Krishna Water)ని ఏపీకి కట్టబెట్టడంవల్ల దక్షిణ తెలంగాణ, కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)ను నాశనం చేయడంవల్ల నీళ్లు లేక ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతోందన్నారు. కాంగ్రెస్ వల్ల నష్టపోతున్న రాష్ట్ర రైతులంతా.. వరి పంట వేయొద్దని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తమకొద్దు అని నినదిస్తున్నారని చెప్పారు. మేధావులైన గ్రాడ్యుయేట్, టీచర్ ఓట్లర్లంతా ప్రజలు పడుతున్న బాధలను అర్ధం చేసుకుని కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకక పోటీ నుండి తప్పుకుంది. కాంగ్రెస్ కు దొరకక బయటి నుండి అరువు తెచ్చుకున్న వ్యక్తిని పోటీలో నిలిపింది. మరో ఇండిపెండెంట్ అభ్యర్ధిని కూడా బరిలో దించింది. ఎవరు గెలిచినా కాంగ్రెస్ లోకి తీసుకుంటారు. కాబట్టి ఓటేసే ముందు టీచర్లు, ఉద్యోగ, పట్టభద్ర ఓటర్లను కోరేదొక్కటే. గ్రాడ్యుయేట్, టీచర్స్, ఎంప్లాయీస్ పక్షాన శాసనమండలిలో గళం విన్పించడంతోపాటు ఆయా సమస్యలపై పోరాడే పార్టీలను మాత్రమే గెలిపించాలని కోరుతున్నా. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ అభ్యర్ధిగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి సరోత్తమ్ రెడ్డి(Sarotham Reddy)ని గెలిపించాలి.
ఎండాకాలం ఇంకా స్టార్ట్ కాలేదు. అప్పుడే రెండో పంటకు వరి వేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెబుతోంది. వరి పంట వేయొద్దంటే మరి ఏ పంట వేయాలి? గంజాయి ఏమైనా పండించాలా?... ఏ పంట వేయాలనే దానిపై ప్రణాళిక ఉందా? అదేమీ లేకుండా వరి వేయొద్దంటే ఎట్లా? అట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా రైతులకొద్దు. ఇప్పటికే రైతులు అల్లాడుతున్నరు. పంట వేస్తే చేతికొచ్చేదాకా తిప్పలు పడుతున్నరు. ఇంత టెన్షన్ లో ఉన్న రైతులను వరి పంట వేయొద్దంటే ఎట్లా? నీళ్లు లేవని చెప్పడం బాధేస్తోంది. రాష్ట్రంలో ఈసారి పుష్కలంగా వర్షాలు కురిసినయ్. నదులన్నీ నిండా కళకళలాడినయ్. అట్లాంటప్పుడు సరైన ప్లాన్ తో రెండు పంటలకు నీరివ్వాల్సింది పోయి... నీళ్లు లేవని చెప్పడమేంది? నీళ్లు లేవని చెప్పడం కాంగ్రెస్ చేతగానితనమే. క్రిష్ణా నదిలో పుష్కలంగా నీళ్లుంటే.. అప్పనంగా ఏపీకి కట్టబెట్టిర్రు. ఆనాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డ్డి అదే పనిచేస్తున్నరు. ఇంకా నీళ్లు దోచి పెడుతూనే ఉన్నరు.
ఇగ గోదావరి విషయానికొస్తే... కాళేశ్వరం ప్రాజెక్టును 50 శాతం కేసీఆర్ నాశనం చేస్తే... మిగిలిన 50 శాతం కాంగ్రెసోళ్లు చేస్తున్నరు. పంపులతో నీళ్లు తోడే అవకాశం లేకుండా చేశారు. వీళ్లవల్ల అటు దక్షిణ తెలంగాణ, ఇటు ఉత్తర తెలంగాణ నీళ్ళు లేక ఎడారిగా మారుతోంది. ఎండా కాలం రానేలేదు. ఇప్పటికే వేసిన వరి పైరు ఎండిపోయింది. దాదాపు 7 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఇగ ఎండాకాలమొస్తే... పరిస్థితి ఎట్లుంటుదో అర్ధం కాలేదు...
అటు నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతూ, ఇటు వరి వేయొద్దని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ కు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. యూరియా అందక ఇబ్బంది పడుతున్నారు. ఇదేందని అడిగితే యూరియా పుష్కలంగా ఉంది సార్ అని అధికారులు చెబుతున్నారు. పుష్కలంగా యూరియా ఉంటే రైతులు క్యూలో నిలబడి, ఆధార్ కార్డులు, చెప్పులు లైన్లో ఉంచుతూ, గంటల తరబడి వేచి చూస్తూ యూరియా స్టాక్ లేదని షాపుల యజమానులు చెబితే వెనుదిరిగి ఎందుకు పోతారు?
ఫీజు రీయంబర్స్ మెంట్ అందక కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు గోస పడుతున్నరు. చిన్న చిన్న కాలేజీలు అడుక్కునే పరిస్థితి ఉంది. అప్పులు చేసి విద్యా సంస్థలు నడిపే దుస్తితి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయంబర్స్ మెంట్ మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పిన నాయకులు... అదికారంలోకి రాగానే హామీలకు గాలికొదిలేస్తున్నరు. 15 శాతం కమీషన్ ఇస్తే... ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఇస్తామని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పడం సిగ్గు చేటు...
ప్రజల కోసం కొట్లాడింది బీజేపీ. లాఠీదెబ్బలు తిన్నది బీజేపీ. రక్తం చిందించి కాళ్లు చేతులు విరగ్గొట్టుకుంది బీజేపీ. ప్రజల కోసం పోరాడిన బీజేపీని కాదని, ఏనాడూ ఒక్క ఉద్యమం కూడా చేయని కాంగ్రెస్ కు ఓటేయడం వల్ల ఏం ఒరిగిందో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ మోసాలతో అల్లాడుతున్న ప్రజల బాధలను, బీజేపీ కార్యకర్తల పోరాటాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆసరా పెన్షన్ల పెంపు లేదు. రైతు భరోసా లేదు. రుణమాఫీ అరకొరే చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ లేదు. టీచర్ల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నయ్. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. చాక్ పీసులు కొనడానికి కూడా డబ్బుల్లేవ్. ఆఖరిరి ఉద్యోగులు రిటైర్డ్ అయితే బెన్ ఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తోంది. గతేడాది 8 వేల మంది రిటైర్డ్ అయ్యారు. ఈ ఏడాది మరో 10 వేల మంది రిటైర్డ్ కాబోతున్నరు.
బెన్ ఫిట్స్ చెల్లించాలంటే 11 వేల కోట్ల రూపాయలు కావాలి. పైసల్లేవంటున్నరు. డబ్బులిచ్చే పరిస్థితి లేక ఉద్యోగుల వయోపరిమితిని 65 ఏళ్లు చేయబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే... ఆయా సమస్యలపై ముందుండి పోరాడే బాధ్యత మేం తీసుకుంటాం. నేను సూటిగా అడుగుతున్నా. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటేస్తే 14 నెలల పాలనలో మీకు ఏమిచ్చింది? 6 గ్యారంటీలను అమలు చేయలేదు. కొత్త రేషన్ కార్డు లేదు. ఒక్క ఇల్లు ఇయ్యలే. ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యలే. ఒక్క సమస్యను పరిష్కరించలేదు.
నరేంద్రమోదీ పాలనలో ఏం లాభం జరిగిందో రోజంతా చెప్పగలం. ఉద్యోగులకు 12 లక్షల 75 వేల రూపాయల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది. తెలంగాణలోని లక్షలాది మంది ఉద్యోగులు కేంద్ర నిర్ణయంవల్ల లాభపడుతున్నరు. యూపీఏ పాలనలో ఆర్ధిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి తీసుకొచ్చినం. మరో రెండేళ్లలో 3వ స్థానంలోకి రాబోతోంది. ఇగ రాష్ట్రం విషయానికొస్తే.... ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుంది బీజేపీ మాత్రమే. టీచర్ల పక్షాన, ఉద్యోగులు, నిరుద్యోగుల పక్షాన పోరాటాలు చేసింది బీజేపీ మాత్రమే. 317 జీవోపై పోరాడితే జైలుకు పంపారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీపై పోరాడుతుంటే... హిందీ పేపర్ ను లీక్ చేశానంటూ దొంగ కేసు బనాయించి అర్ధరాత్రి అరెస్ట్ చేసి హన్మకొండ తీసుకొచ్చారు. జైలుకు పంపారు. ఉపాధ్యాయుల పక్షాన మేం పోరాడుతుంటే... ఏ ఉపాధ్యాయ సంఘం కనీసం స్పందించలేదు.
ఉపాధ్యాయులు కష్టాల్లో ఉంటే స్పందించకపోగా, కనీసం సంఘీభావం తెలపని సంఘాలను ఎందుకు నమ్మి ఓటేయాలి? పైరవీలకే పరిమితమయ్యే నాయకులను నమ్మి ఇంకా మోసపోతారా? ఆలోచించండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని కాంగ్రెస్ కు తెలిసిపోయింది. ఏ సర్వే చూసినా విజయం బీజేపీదేనని తేల్చడంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగి పైసలు పంచేందుకు సిద్ధమైండు. రేవంత్ కాదు కదా... రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ విజయం ఖాయమైంది.