నిరంకుశ పాలన అంతమై తెలంగాణ స్వేచ్ఛ పొందింది : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

by M.Rajitha |
నిరంకుశ పాలన అంతమై తెలంగాణ స్వేచ్ఛ పొందింది : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : యావత్ దేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్ర్యం వస్తే.. 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17న నిరంకుశ నిజాం పాలన అంతమై తెలంగాణ స్వేచ్ఛ పొందిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విమోచనం కోసం జరిపిన పోరాటంలో అమరులైన స్మరించుకోవడంతో పాటు భావి తరాలకు రజాకార్ల ఆకృత్యాలను చెప్పాలని వివిధ రాజకీయ పార్టీలు నిర్ణయించుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిందని మండిపడ్డారు. ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహించడం రాజ్యాంగ బద్ధమైనది కాదని భావిస్తున్నట్లుగా చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటకలో నిర్వహిస్తున్నట్లుగా అధికారికంగా విమోచన ఉత్సవాలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజానికి 1948 సెప్టెంబర్ 17 నాటికి ప్రజాపాలన లేదని, సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న చర్యల తర్వాత హైదరాబాద్ సంస్థానం విమోచనం పొంది భారతదేశంలో విలీనమైందన్నారు. 1952లో బూర్గుల రామకృష్ణారావు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాకే ప్రజాపాలన మొదలైందని కాసం తెలిపారు. తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను తక్కువ చేసి చూపించి, పోటాపోటీగా ఒకదానికొకటి ప్రజలను మాయచేసేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వక్రభాష్యం చెబుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా చేస్తున్నాయని ఆయన ఫైరయ్యారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారికంగా వేడుకలు జరపాలని డిమాండ్ చేసి, అధికారంలో వచ్చాక మాట మార్చారని విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవంగా చేపడుతోందని, ఇది పూర్తిగా అర్థ రహితమని మండిపడ్డారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్.. విమోచన దినోత్సవంపై వక్రభాష్యం చెబుతోందని పేర్కొన్నారు. నాడు ఢిల్లీ ఎర్రకోట మీద అసఫ్‌ ‌జాహీ పతాకం(నిజాం జెండా) ఎగరేస్తామని రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ ప్రకటించారన్నారు. అదే నేటి ఎంఐఎం కోరిక అని, కమ్యూనిస్టులదీ అదే కోరిక అని ఆయన ఎద్దేవాచేశారు. 8 ఆగస్టు 1947న వరంగల్‌లో త్రివర్ణ పతాకం ఎగుర వేసినందుకు మొగలయ్యను రజాకార్లు దాడిచేసి చంపేశారని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారన్నారు. విమోచనం కోసం అన్ని వర్గాల ప్రజలు కలిసి చేసిన పోరాటంతో పాటు ఆపరేషన్ పోలోతో 17 సెప్టెంబర్ 1948న తెలంగాణకు అసలైన స్వాతంత్ర్యం లభించిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed