డేటా చౌర్యంపై ఆర్మీ.. నేవీ సీరియస్ ​నజర్..​

by Vinod kumar |   ( Updated:2023-04-02 16:52:25.0  )
డేటా చౌర్యంపై ఆర్మీ.. నేవీ సీరియస్ ​నజర్..​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆర్మీ, నేవీలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన డేటా చౌర్యానికి గురైనట్టు స్పష్టమైన నేపథ్యంలో డిఫెన్స్​ఉన్నతాధికారులు దీనిపై సీరియస్​గా దృష్టిని సారించారు. గతంలో పాకిస్తాన్ నిఘా విభాగమైన ఇంటర్ సర్వీసెస్​ఇంటెలిజెన్స్​కు చెందిన లేడీ ఏజెంట్లు మన జవాన్లను హనీట్రాప్​చేసి రహస్యాలు సేకరించిన ఉదంతాలు ఉన్న నేపథ్యంలో డేటా చౌర్యంపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆర్మీ, నేవీలకు చెందిన ఇంటెలిజెన్స్​విభాగాలకు చెందిన సీనియర్​ అధికారులను రంగంలోకి దింపారు. ఈ అధికారులు ఇప్పటికే సైబరాబాద్​పోలీసులతో సమావేశమయ్యారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆర్మీ, నేవీ ఉద్యోగులకు సంబంధించిన డేటా వివరాలను తీసుకున్నారు. మరోవైపు పవర్​సెక్టర్​తోపాటు పలు కీలక ప్రభుత్వ శాఖల సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించినట్టు తేలిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖ కూడా కేసు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు సమాచారం.

లక్షల్లో ఆర్మీ, నేవీ ఉద్యోగుల డేటా..

సైబరాబాద్​ పోలీసులు ఇటీవల నొయిడా కేంద్రంగా డేటా చౌర్యానికి పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి 16కోట్ల ఎనభై లక్షల మందికి సంబంధించిన పర్సనల్​డేటాను స్వాధీనం చేసుకున్నారు. వీరిని జరిపిన విచారణలో ఆర్మీ, నేవీలకు చెందిన రెండున్నర లక్షల మంది ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి అమ్ముకున్నట్టుగా వెల్లడైంది. ఈ గ్యాంగును అరెస్టు చేసిన రెండు రోజులకే సైబరాబాద్​పోలీసులు మరో తొమ్మదిమందిని కూడా సైబరాబాద్​పోలీసులు అరెస్టు చేశారు.

విచారణలో వీళ్లు వెల్లడించిన వివరాల మేరకు హర్యానా రాష్ర్టం ఫరీదాబాద్​కేంద్రంగా డేటా చౌర్యానికి పాల్పడుతున్న వినయ్​ భరద్వాజ్​ను అరెస్టు చేశారు. వినయ్ ​భరద్వాజ్​ నుంచి 66 కోట్ల తొంభై లక్షల మంది డేటాను స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఆర్మీ, నేవీలకు చెందిన రెండు లక్షల యాభై వేలమంది ఉద్యోగుల పర్సనల్​డేటా (పేర్లు, ఈ మెయిల్​ఐడీలు, మొబల్​నెంబర్లు) ఉన్నట్టుగా తేలింది. ఈ వివరాలు దేశ సరిహద్దులు దాటినట్టు అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా ఈ పరిణామమే రక్షణ శాఖలో కలవరం కలిగిస్తోంది.

హనీట్రాప్​లే కారణం..

రక్షణ శాఖ ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతున్న ఈ ఆందోళనకు ప్రధాన కారణం గతంలో మన సైన్యంలోని కొందిరిని పాకిస్తాన్​కు చెందిన ఇంటర్​సర్వీసెస్​ఇంటెలిజెన్స్​కు చెందిన మహిళా ఏజెంట్లు హనీట్రాప్​లోకి లాగటమే. తమ ఉచ్ఛులో చిక్కిన వారి నుంచి మన దేశా సైన్యానికి సంబంధించిన రహస్యపత్రాలు, వ్యూహాత్మక ప్రాంతాల ఫోటోలు, ఆయా ప్రాంతాల్లో మోహరించిన ఆయుధాలు, సిబ్బంది వివరాలను తెలుసుకోవటమే. దీనికి నిదర్శనంగా గత సంవత్సరం పాకిస్తాన్​లేడీ ఏజెంట్ల వలలో పడ్డ శాంతిమె రాణా (24) ఉదంతాన్ని పేర్కొనవచ్చు.

పశ్చిమబంగకు చెందిన రాణా జైపూర్​లోని ఆర్టిలరీ యూనిట్​లో జవానుగా పనిచేసేవాడు. పాకిస్తాన్​కు చెందిన ఇద్దరు మహిళా ఏజెంట్లు గుర్నౌర్​కౌర్​అంకిత, నిషాలు (అసలు పేర్లు కావు) సోషల్​మీడియా ద్వారా రాణాతో పరిచయం ఏర్పరుచుకున్నారు. తమదైన శైలిలో రాణాతో వాట్సాప్​కాల్స్​మాట్లాడి అతన్ని పూర్తిగా తమ ఉచ్ఛులో బిగించారు. ఆ తరువాత అతని అకౌంట్లో కొంత డబ్బును జమ చేసి రాణా పని చేస్తున్న రెజిమెంట్​కు సంబంధించిన రహస్యపత్రాలు, ఫోటోలు, వీడియోలు తెప్పించుకున్నారు.

ఈ విషయం బయటపడటంతో ఉన్నతాధికారులు అధికారిక రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి రాణాను అరెస్టు చేశారు. అదే సంవత్సరంలో జోద్​పూర్​రెజిమెంట్​లో పనిచేస్తున్న జవాన్​ప్రదీప్​కుమార్ (24)ను ఫేస్​బుక్​ద్వారా పరిచయం చేసుకున్న మరో పాకిస్తానీ లేడీ ఏజెంట్​అతన్ని వలలోకి లాగి వాట్సాప్​ద్వారా పలు రహస్యపత్రాలు, ఫోటోలు తీసుకున్నట్టు వెల్లడైంది. దాంతో ఆర్మీ అధికారులు ప్రదీప్​కుమార్​ను కూడా అరెస్టు చేశారు.

ఇక, రూర్కీలోని మిలటరీ ఇంజనీరింగ్​రెజిమెంట్​లో అకౌంటెంట్​గా పనిచేస్తున్న ఇమాంఖాన్​(34)ను ఇదేవిధంగా హనీట్రాప్​లోకి లాగిన పాకిస్తానీ మహిళా ఏజెంట్​ఒక్క నెలలోనే రెండు వందల వాట్సాప్​మెసేజీల ద్వారా రహస్యపత్రాలను తీసుకుంది. ఈ వ్యవహారం బయటపడటంతో ఉన్నతాధికారులు ఇమాంఖాన్​ను కూడా అరెస్టు చేశారు.

ఈ అనుభవాల నేపథ్యంలోనే..

ఈ క్రమంలోనే రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితుల నుంచి ఆర్మీ, నేవీ ఉద్యోగులకు సంబంధించిన డేటా విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లి ఉండవచ్చన్న అనుమానాలు బలంగా ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇటు ఆర్మీ...అటు నేవీకి చెందిన ఇంటెలిజెన్స్​విభాగాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే వీళ్లు సైబరాబాద్​పోలీసులను నాలుగైదుసార్లు కలిసారు కూడా. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రక్షణ శాఖ ఉద్యోగుల డేటాను కూడా వీళ్లు తీసుకున్నట్టు సమాచారం.

ఈ డేటాలో 22 ఏళ్ల నుంచి 36 సంవత్సరాల మధ్య వయసున్న వారి వివరాలను వేరు చేస్తున్నట్టుగా సమాచారం. వీరికి సంబంధించిన మొబైల్​ఫోన్ల కాల్​డేటాతోపాటు వాట్సాప్​ఛాటింగులు, కాల్స్, ఇతర సోషల్​మీడియా యాప్​ల ద్వారా ఎవరెవరితో మాట్లాడారు? అన్న వివరాలను తెప్పించుకోవాలని నిర్ణయించినట్టు తెలియవచ్చింది.

ఈ వివరాలను సమగ్రంగా పరిశీలిస్తే ఎవరికైనా హనీట్రాప్​కాల్స్​వచ్చాయా? వస్తే స్పందించారా? స్పందిస్తే ఎంతకాలం నుంచి హనీట్రాప్​వ్యవహారం జరుగుతోంది? అన్న విషయాలు స్పష్టమవుతాయని భావిస్తున్నారు. ఈ వివరాలనుబట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక, డేటా చౌర్యానికి పాల్పడ్డ నిందితులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు చెందిన పలు కీలక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు కూడా తస్కరించినట్టు స్పష్టమైన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఈ వ్యవహారంపై దృష్టిని సారించినట్టు సమాచారం. నిందితులను జరిపే విచారణలో వెల్లడైన వివరాలను ఎప్పటికప్పడు తమకు అందచేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే దర్యాప్తు అధికారులకు సూచించినట్టుగా తెలియవచ్చింది.

Advertisement

Next Story