యూట్యూబ్ చిట్కాలతో ఎవరెస్టు అధిరోహించిన 59 ఏళ్ల మహిళ

by D.Reddy |   ( Updated:2025-03-19 14:59:37.0  )
యూట్యూబ్ చిట్కాలతో ఎవరెస్టు అధిరోహించిన 59 ఏళ్ల మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును (Everest) అధిరోహించాలని చాలా మంది కలలు కంటారు. కానీ, ఇది ఎంతో కష్టంతో కూడుకున్న సాహసం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీనదాలు, మంచు ప్రతికూల పరిస్థితులు.. ఇలా ఎన్నో క్లిష్ట వాతావరణ పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగాలి. అందుకే పూర్తి ఆరోగ్యంగా ఉండి సరైనా శిక్షణ తీసుకున్న వారే ఎవరెస్టు అధిరోహించేందుకు సిద్ధపడుతుంటారు. కానీ, కేరళకు చెందిన ఓ 59 ఏళ్ల మహిళ (59-year-old woman) ఎలాంటి శిక్షణ లేకుండా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు (Record) క్రియేట్ చేశారు.

కేరళ (Kerala) రాష్ట్రం కన్నూర్‌లోని తాలిప్పరంబా నివాసి 59 ఏళ్ల వసంతి చెరువువీట్టిల్‌కు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో ట్రెక్కింగ్ సంబంధించిన శిక్షణ వీడియోలను చూసి ప్రాక్టీస్ చేయటం ప్రారంభించింది. ప్రతి రోజూ 3 నుంచి 4 గంటల పాటు ట్రెక్కింగ్ బూట్లు వేసుకుని ఐదారు కిలో మీటర్లు నడిచేది. అలాగే, ఉత్తరాదిన భాష పరమైన ఇబ్బందులు రాకుండా హిందీ కూడా నేర్పుకుంది.

ఇక అనంతరం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు పయనమైంది. ఫిబ్రవరి 15న నేపాల్‌లోని సుర్కే నుంచి తన ట్రెక్కింగ్‌ను ప్రారంభించి ఫిబ్రవరి 23న ఎవరెస్టు సౌత్ బేస్ క్యాంపుకు చేరుకుని అద్భుతమైన ఘనత సాధించింది. అయితే, ట్రెక్కింగ్ సమయంలో ఆమెకు జర్మన్‌కు చెందిన ఓ జంట, తిరువనంతపురం నుంచి వచ్చిన తండ్రీకొడుకులు సాయం చేసినట్లు వసంతి తెలిపింది. అంతేకాదు, ట్రెక్కింగ్ సమయంలో పలు వాతావరణ పరిస్థితుల సంబంధిత ఇబ్బందులు పడినట్లు చెప్పింది.

ఇక ఎవరెస్టు బేస్ క్యాంప్ వద్ద ఆమె కేరళ సాంప్రదాయ చీరలో భారత జెండాను ఊపుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. వసంతి జర్నీ ఎంతో మందికి ఆదర్శనీయమని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More..

భర్తపై కోపంతో టవర్ ఎక్కిన భార్య.. ప్రాణాలు కాపాడిన పోలీస్ పై ప్రశంసలు

Next Story

Most Viewed