ఒక్క చాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..

by Sumithra |
ఒక్క చాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్, జడ్చర్ల : ‘నేను స్థానికుడిని.. ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇస్తే తరతరాలు గుర్తుంచుకునేలా జడ్చర్ల నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తా’ అని టీపీసీసీ కార్యదర్శి అనిరుద్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్’ పాదయాత్రలో పాల్గొన్న అనిరుద్ రెడ్డితో ‘దిశ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది..?

అనిరుద్ రెడ్డి: మాది రాజకీయ కుటుంబం. మా పూర్వీకులు దేవాలయానికి ఇచ్చిన భూములను అధికార పార్టీ నాయకులు అక్రమంగా విక్రయించారు. దాన్ని కాపాడేందుకు మేం ప్రయత్నిస్తే రెవెన్యూ, దేవాదాయ, పోలీసు అధికారులు సహకరించలేదు. దీంతో రాజకీయాల్లోకి వచ్చి ఆ భూములను కాపాడగలిగాను.

కాంగ్రెస్ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు..?

అనిరుద్ రెడ్డి: పేదలకు కాంగ్రెస్ పార్టీనే న్యాయం చేస్తుందని నమ్ముతున్నా. మా ఆత్మీయులు కోమటిరెడ్డి బ్రదర్స్ సలహాతో కాంగ్రెస్ లో చేరాను. జడ్చర్ల నియోజక వర్గంలో అడ్రస్ లేని కాంగ్రెస్ పుంజుకునేట్లు చేశాను. నియోజక వర్గ బాధ్యతలు స్వీకరించి, పలు కార్యక్రమాలు చేపడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాను.

నియోజక వర్గంలో ప్రధాన సమస్యలేంటి..?

అనిరుద్ రెడ్డి: అధికార పార్టీ నేతలు భూ దందాలకు ఎగబడ్డారు. రైతులకు రుణమాఫీ లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అడ్రస్ లేదు. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఉపాధి అవకాశాల్లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లోకి రావడంతో మీకు టికెట్ వస్తుందా..?

అనిరుద్ రెడ్డి: పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న. ఖర్చుకు వెనుకాడకుండా రాహుల్ గాంధీ పర్యటనతో పాటు కాంగ్రెస్ కార్యక్రమాలను సక్సెస్ చేస్తున్నా. ఎమ్మెల్యే టికెట్ నాకే ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు గతంలోనే హామీ ఇచ్చారు.

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. వెంకటరెడ్డి కూడా పార్టీ మారితే మీ పరిస్థితి..?

అనిరుద్ రెడ్డి: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటానని నాకు స్పష్టంగా చెప్పారు. నేనూ పార్టీ మారను. జడ్చర్ల నుంచే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.

మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ సమస్యలు పరిష్కరిస్తారు..?

అనిరుద్ రెడ్డి: నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నా పరిశ్రమలతో పాటు మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలిస్తా. అర్హులైన పేదలంకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటా. వ్యవసాయ రుణాల మాఫీకి చర్యలు తీసుకుంటా. అధికార పార్టీ నేతల భూ దందాలు, ఆక్రమణలపై విచారణ చేయిస్తా.

Advertisement

Next Story

Most Viewed